18, మే 2017, గురువారం

విజయనగర సామ్రాజ్యము (క్రీ.శ.1336 – 1646)

విజయనగర సామ్రాజ్యము (క్రీ.శ.1336 – 1646)

రాజధాని          :    విజయనగరం (బళ్ళారి జిల్లా)


రెండో రాజధాని   :    పెనుగొండ (అనంతపురం జిల్లా)


అధికార భాష(లు)    :  కన్నడ , తెలుగు


మతము    :    హిందూ మతం 

   ప్రభుత్వం , పరిపాలన : రాచరికం (రాజు) 

స్థాపన :  మొదటి హరిహర రాయలు (1336–1356)

 పతనం :  మూడవ శ్రీరంగరాయలు (1642–1646)




విజయనగర సామ్రాజ్యం - రాజులు



సంగమ వంశము

మొదటి హరిహర రాయలు    (1336-1356)


 మొదటి బుక్క రాయలు    (1356-1377)

రెండవ హరిహర రాయలు    (1377-1404)



విరూపాక్ష రాయలు    (1404-1405)


రెండవ బుక్క రాయలు    (1405-1406)

మొదటి దేవ రాయలు    (1406-1422)

రామచంద్ర రాయలు    (1422-1422)

వీర విజయ బుక్క రాయలు    (1422-1424)

రెండవ దేవ రాయలు    (1424-1446)

మల్లికార్జున రాయలు    (1446-1465)

రెండవ విరూపాక్ష రాయలు    (1465-1485)

ప్రౌఢ రాయలు    (1485-1485)





సాళువ వంశము

సాళువ నరసింహ దేవ రాయలు    (1485-1491)

తిమ్మ భూపాలుడు    (1491-1491)

రెండవ నరసింహ రాయలు    (1491-1505)






తుళువ వంశము

తుళువ నరస నాయకుడు    (1491-1503)

వీరనరసింహ రాయలు    (1503-1509)

శ్రీ కృష్ణదేవ రాయలు    (1509-1529)

అచ్యుత దేవ రాయలు    (1529-1542)

సదాశివ రాయలు    (1542-1570)




అరవీటి వంశము

అళియ రామ రాయలు    (1542-1565)

తిరుమల దేవ రాయలు    (1565-1572)

శ్రీరంగ దేవ రాయలు    (1572-1586)

రెండవ  వెంకటపతి రాయలు  (1586-1614)

రెండవ  శ్రీరంగ దేవ రాయలు  (1614-1614)

రామదేవ  రాయలు   (1617-1632)

 మూడవ  వెంకటపతి రాయలు   (1632-1642)

మూడవ  శ్రీరంగ దేవ రాయలు    (1642-1675)




స్థాపన

విజయనగర సామ్రాజ్యానికి భారతదేశ చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావని మొత్తం తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన ధర్మము, సంస్కృతి, వేషభాషలు, ఆచారములు కనుమరుగై పోవు స్థితిలో హిందూమత సంరక్షణకు నడుముగట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా స్వరక్షణకై పోరాటములు సల్పి చాలావరకు కృతకృత్యులయిన దేశాభిమానుల చరిత్ర విజయనగర ఇతిహాసము.


విజయనగర సామ్రాజ్య స్థాపనకు శతాబ్దము మునుపు దక్షిణ భారత దేశము లోని రాజ్యములను ముస్లింలు జయించారు. 1309 లో మాలిక్ కాఫర్ ఓరుగల్లును ఆక్రమించి మలబార్ రాజ్యములపై దాడి చేశాడు. ఆ సమయమున హరహర మరియు బుక్క అను సోదరులు ప్రతాపరుద్రుని ఆస్థానములో కోశాధికారులుగా ఉన్నారు. సోదరులిద్దరిని ఢిల్లీకి తరలించి ఇస్లాము మతానికి మార్చారు. హోయసల రాజు తిరుగుబాటు అణచివేయుటకు సుల్తాను వీరిద్దరినీ ద్వారసముద్రము పంపాడు. సోదరులు తమకిచ్చిన కార్యము నెరవేర్చారు గాని శ్రీ విద్యారణ్య స్వామి ప్రభావముతో తిరిగి హిందూ మతము స్వీకరించి విజయనగర రాజ్యము స్థాపించారు.



హరిహర రాయలనే దేవరాయలని కూడా అంటారు. అతడే విజయనగర సామ్రాజ్యానికి తొలి చక్రవర్తి. ముస్లిమ్ చరిత్రకారుడు బర్ని ప్రకారము బుక్కరాయలు ముసునూరి కాపనీడు బంధువు. కాని ఇది సబబుగా తోచదు. దక్కను ప్రాంతంలోని ముస్లిమ్ సామంతుల తిరుగుబాట్ల వల్ల ముహమ్మద్ తుగ్లక్ పాలన అంతమవడంతో హరిహరరాయలు ఏలుబడిలోని ప్రాంతం త్వరితంగా విస్తరించింది. విజయనగర రాజధాని 1340 ప్రాంతంలో ఆనెగొందికి ఎదురుగా తుంగభద్రానదికి ఆవలి తీరాన స్థాపించబడింది. హరిహరరాయల తర్వాత 1343 లో అధికారంలోకి వచ్చిన బుక్కరాయలు 1379 వరకు పాలించాడు. అతడి పాలనా కాలం చివరకొచ్చేసరికి దక్షిణభారత దేశంలో తుంగభద్రానదికి దక్షిణాన ఉన్న ప్రాంతమంతా దాదాపుగా అతడి ఏలుబడిలోకి వచ్చింది.






తారాస్థాయి

తరువాత రెండు శతాబ్దాలలో, విజయనగర సామ్రాజ్యము యొక్క ఆధిపత్యము దక్షిణ భారత దేశమంతటా ప్రకాశించింది. యావద్భారత ఉపఖండములోనే విజయనగరము బలీయమైన రాజ్యంగా వెలిసింది. ఈ కాలంలో గంగా మైదానం నుండి వచ్చిన టర్కీ సుల్తానుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. దక్కను లోని ఐదుగురు సుల్తానుల నుండి నిరంతరంగా ఘర్షణలను ఎదుర్కొని ఒక బలీయమైన శక్తిగా నిలబడింది.


విజయనగర రాజులకు సామంతులుగా కమ్మరాజులు అయిన పెమ్మసాని నాయకులు, సూర్యదేవర నాయకులు, శాయపనేని నాయకులు, రావెళ్ళ నాయకులు ఆంధ్రదేశాన్ని పాలిస్తూ విజయనగర సామ్రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షులుగా ఉంటూ యుద్ధాల్లో తోడ్పడుతూ విజయనగర రక్షణ కవచంలా వారు ఎదురు నిలిచారు.



1510 ప్రాంతాల్లో బిజాపూరు సుల్తాను అధీనంలో ఉన్న గోవాను పోర్చుగీసు వారు ఆక్రమించుకున్నారు. ఇది బహుశా విజయనగర రాజ్యపు అనుమతి లేదా రహస్య అవగాహన ద్వారా జరిగి ఉండవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు వీరికి చాలా ముఖ్యమైనవి.



శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఈ సామ్రాజ్యం ఉచ్ఛస్థితికి చేరింది. దక్కనుకు తూర్పున కొండవీడు, రాచకొండ, కళింగుల అధీనంలోగల ప్రాంతాలను, తమిళదేశమును వశపరచుకున్నాడు. సామ్రాజ్యపు గొప్ప గొప్ప నిర్మాణాలు ఆయన తోటే మొదలయ్యాయి. విజయనగరం లోని హజార రామాలయం, కృష్ణ దేవాలయం, ఉగ్ర నరసింహ మూర్తి విగ్రహం వీటిలో కొన్ని.



1530 లో అచ్యుతరాయలు ఆయనకు వారసుడయ్యాడు. 1542 లో అళియ రామరాయలు గద్దెనెక్కాడు. ఇతడు దక్కను సుల్తానులను అనవసరంగా రెచ్చగొట్టి వారి శత్రుత్వం కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. 1565 తళ్ళికోట యుద్ధంలో విజయనగర సైన్యాన్ని దక్కను సుల్తానులు చిత్తుగా ఓడించారు. సంయుక్త సుల్తాను సైన్యం రాజధానిని సర్వనాశనం చేసి, నేలమట్టం చేసింది. యుద్ధంనుండి సజీవముగా బయటపడిన రామరాయల తమ్ముడు తిరుమలరాయలు, సదాశివరాయలతో సహా పెనుగొండకు పారిపోయాడు.



విద్యా, సాంస్కృతిక పరంగా విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంగా పరిగణిస్తారు.




పతన దశ

తళ్ళికోట యుద్ధానంతర దశను విజయనగర సామ్రాజ్య పతనదశగా చెప్పుకోవచ్చు. 1565లో తళ్లికోట యుద్ధం జరిగి యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పూర్తిగా ఓటమిచెందిన తర్వాత తిరుమల దేవరాయలు నామమాత్ర పరిపాలకుడైన సదాశివరాయలను తీసుకుని విజయనగర ఖజానాను ఎత్తుకుని పెనుగొండకు పారిపోయారు. విజయనగరాన్ని పాదుషాలు నేలమట్టం చేసి వదిలిపోయాక తిరుమల దేవరాయలు ఆ రాజధానిని బాగుచేసుకుని పరిపాలించేందుకు మూడేళ్ళపాటు ప్రయత్నించారు. శ్మశానంలా తయారైన ఈ రాజధానిని తిరిగి ఏలుకోలేక పెనుగొండకు తిరిగివచ్చారు. అంతటితో విజయనగర సామ్రాజ్యపు రాజధానిగా విజయనగరం ముగిసిపోయింది. ఆపైన కొన్నేళ్ళు పెనుగొండ, మిగిలిన సంవత్సరాలు చంద్రగిరిలను రాజధానులుగా చేసుకుని పాలించారు.


తళ్ళికోట ఓటమి తర్వాత రాజ్యభాగాలు తగ్గిపోనారంభించాయి. తిరుమలదేవరాయలు తన ముగ్గురు కుమారులను మూడు ప్రాంతాలకు ప్రతినిధులుగా పరిపాలింపజేశారు. పెద్దకుమారుడైన రామరాయలు కన్నడప్రాంతాలను శ్రీరంగపట్నం రాజధానిగా పరిపాలించారు. రెండో కుమారుడు శ్రీరంగ దేవరాయలు పెనుగొండను రాజధానిగా చేసుకుని తెలుగు ప్రాంతాలను పరిపాలించారు. మూడో కుమారుడు వేంకటపతి దేవరాయలు మొదట చంద్రగిరిని రాజధానిగా చేసుకుని తమిళ ప్రాంతాలు పాలించేవారు. విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా శ్రీరంగదేవరాయలు తెలుగు ప్రాంతాల విషయంలో చాలా ప్రయత్నాలు చేసి, వైభవాన్ని పునరుద్ధరించేందుకు విఫలయత్నాలు చేశారు. బీజాపూరు సుల్తానులతో కొన్ని యుద్ధాల్లో గెలిచి, కొన్ని ఓడిపోయారు. ఆయనకు పుత్రసంతానం లేకపోవడంతో చిన్నతమ్ముడు చంద్రగిరి పాలకుడు అయిన వేంకటపతి దేవరాయలకు రాజ్యాన్నిచ్చారు. ఆయన పాలనకాలంలోనే బ్రిటీషు వారికి మద్రాసు పట్టణం ఏర్పాటు చేయటానికి భూమి మంజూరు చేశారు. కొంతకాలం పాటు పెనుగొండను రాజధానిగా చేసుకుని అన్నగారు ఇచ్చిన సామ్రాజ్యాన్ని పాలించినా ఆపైన మాత్రం రాజధానిని తన పట్టణమైన చంద్రగిరికే మార్చుకున్నారు. ఆయన విజయనగర సామ్రాజ్యపు ఆఖరి గొప్ప చక్రవర్తిగా పేరొందారు. ఆయన కాలంలో శ్రీరంగపట్నాన్ని ఒడయారు రాజులు స్వతంత్రం ప్రకటించుకున్నారు. స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోకపోయినా కొందరు రాజులు స్వతంత్రించే వ్యవహరించేవారు.








వంశ పరంపర





సంగమ వంశము


సంగమ వంశము 1336 నుండి 1485 వరకు కొనసాగినది. ఈ కాలము విజయనగర సామ్రాజ్యానికి అంకురార్పణ జరిగిన సమయము.


సంగముని కుమారులైన హరిహర రాయలు, బుక్కరాయలు బహుశా గుంటూరు ప్రాంతము వారు అయిఉండవచ్చును. వారు ఓరుగల్లు ప్రతాప రుద్రుని కోశాగార ఉద్యోగులు. 1323 లో ఓరుగల్లును ఢిల్లీ సుల్తాను ఆక్రమించగా ఈ సోదరులు కర్ణాటక ప్రాంతపు ఆనెగొంది రాజు కొలువులో చేరిరి. 1334 లో ఆనెగొందిని ఆక్రమించిన సుల్తాను మాలిక్ ను తన ప్రతినిధిగా నియమించెను. కాని ప్రజలు తిరుగుబాటుచేయగా, మాలిక్ బదులు హరిహర బుక్క సోదరులను రాజు, మంత్రులుగా నియమించెను. వారు తరువాత స్వాతంత్ర్యము ప్రకటించిరి (ఇందుకు భిన్నముగా కూడా కొన్ని చరిత్రలలో ఉన్నది).


వీరికి విద్యారణ్య స్వామి వారి సహాయమూ, మార్గ దర్శకత్వమూ లభించాయి. వారి సలహాతో వీరు విజయనగరమును పటిష్ఠమైన నగరముగా నిర్మించారు. ఏడుప్రాకారాలతో, మూడుప్రక్కల కొండలతో, ఒకవైపు అగడ్తతో, ఉత్తరాన తుంగభద్రా నదితో ఇది 14 మైళ్ళ పొడవు, 10 మైళ్ళ వెడల్పు ఉండి, విద్యలకు, ఐశ్వర్యానికి నిలయమై, ప్రపంచంలో సాటిలేని నగరంగా ప్రకాశించింది.


రెండవ దేవ రాయలు (ప్రౌఢ దేవ రాయలు) ఈ వంశములో ప్రసిద్ధుడు. గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. కవి. కవులను, పండితులను పోషించాడు. శ్రీనాధుడు ఈయన ఆస్థానమును సందర్శించాడు. రెండవ దేవ రాయలు అప్పటి భారతదేశములోని అందరు రాజులకంటే బలవంతుడు. అతనికి 12000 భార్యలు. వారిలో 2000 మంది వరకు సహగమనము చేయడానికి సంసిద్ధులు. నికోలో కాంటే అనే ఇటలీ యాత్రికుడు ఈ కాలంలోనే విజయనగరానికి వచ్చి, ఆ నగర వైభవాన్ని, సామ్రాజ్య స్థితి గతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.


తరువాత బలహీనులైన రాజుల వల్ల క్రమముగా సంగమ వంశము క్షీణించి, వారసత్వ కలహాల వల్ల, విజయ నగర రాజ్యానికే ప్రమాదము వాటిల్లింది. 1485 నుండి సాళువ వంశము పాలన ప్రారంభమైనది.







మొదటి హరిహర రాయలు (1336-1356)


మొదటి హరిహర రాయలు విజయనగర సామ్రాజ్య స్థాపకుడు. ఇతనికి "హక్కరాయలు" మరియు "వీర హరిహరుడు" అనే పేర్లున్నాయి.


విజయనగర సామ్రాజ్య స్థాపన


హరిహర మరియు ఇతని తమ్ముడు బుక్క కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని వద్ద కోశాధికారులుగా ఉన్నారు. 1323వ సంవత్సరములో ఓరుగల్లు పతనము తరువాత ఈ సోదరులిద్దరూ కంపిలికి పోయి ఆనెగొంది సంస్థానములో చేరారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1326లో కంపిలిని జయించినపుడు వీరిద్దరూ బందీలుగా ఢిల్లీ తరలించబడ్డారు. దారిలో భయంకరమైన గాలి దుమారం వచ్చి సైనికులు, బందీలు చెల్లాచెదరయ్యారు. సోదరులిద్దరు మాత్రము పారిపోక ఒక చెట్టు కింద కూర్చొనివుండగా సుల్తాను గమనించి వారిని ప్రశ్నించగా వారిచ్చిన సమాధానానికి సంతసించి వారికి ఢిల్లీ దర్బారులో స్థానమిచ్చాడు. సోదరులిద్దరూ ఇస్లాం మతానికి మార్చబడ్డారు.


కంపిలిలో మాలిక్ నవాబు పట్ల వ్యతిరేకత పెల్లుబికి రాజ్యము చేజారిపోగా విప్లవాన్ని అణచివేయుటకు తుగ్లక్ హరిహర, బుక్క రాయలను పంపాడు. అన్నదమ్ములు కంపిలిని స్వాధీనపరచుకున్నారు. శ్రీ విద్యారణ్య స్వామి ప్రభావముతో తిరిగి హిందూ మతము స్వీకరించి సుల్తాను నెదిరించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.


ప్రాబల్యం

మొదటగా హరిహరరాయలు, బుక్కరాయలు తుంగభద్రానది లోయ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకొన్నారు. క్రమంగా కొంకణ తీరం, మలబారు తీరం వారి అధీనంలోకి వచ్చాయి. ఈ సమయంలో హొయసల రాజ్యం పతనమైంది. మధుర సుల్తానుతో యుద్ధంలో చివరి హొయసల రాజు వీరభల్లాలుడు మరణించాడు. ఇలా ఏర్పడిన పాలనాశూన్యత హరిహరరాయలుకు రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి బాగా పనికివచ్చింది. హొయసల రాజ్యం మొత్తం వారికి వశమయ్యింది. 1346 కాలానికి చెందిన శృంగేరి శాసనంలో ’హరిహరుడు రెండు సముద్రాల మధ్యభాగానికి రాజు’ అని, అతని రాజధాని విద్యానగరమని చెప్పబడింది.

హరిహరుడు సుస్థిరమైన పాలనా వ్యవస్థను ఏర్పరచాడు. ఇందువల్ల రాజ్యం సుస్థిరమయ్యింది. ఇతని తరువాత ఇతని తమ్ముడు మొదటి బుక్క రాయలు రాజ్యానికి పాలకుడయ్యాడు. సంగమవంశంలో బుక్కరాయలు అందరికంటే ముఖ్యునిగా పరిగణించబడ్డాడు.

మూలాలు

ఈయన గురించి అటకల గుండు శాసనం తెలియజేస్తుంది.


మొదటి బుక్క రాయలు (1356-1377)


 మొదటి హరిహర రాయలువారి సోదరుడు మొదటి బుక్క రాయలు. ఇతడు క్రీ. శ. 1356నందు విజయనగర సింహాసనమధిష్టించాడు. ఇతడు విజయనగర రాజ్య స్థాపనమున, తరువాత బహుమనీ సుల్తాను లతో జరిగిన యుద్ధములందు తన అన్నగారయిన మొదటి హరిహర రాయలునకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఇతని కుమారుడు కంప రాయలు అనేక హిందూ క్షేత్రములను మహమ్మదీయుల అధీనమునుండి స్వాధీనము చేసుకున్నాడు.


బహుమనీ సుల్తానులతో యుద్దాలు

మొదటి యుద్దము

బహుమనీ సుల్తాను అయిన మహమ్మద్‌ షా I ఓరుగల్లును ముట్టడించి, ఓరుగల్లునకు సహాయముగా వచ్చిన విజయ నగర ప్రభువులను కూడా ఓడించాడు, ఆ తరువాత సుల్తాను 1366 లో అపరాధరుసుము చెల్లించమని బుక్క రాయలకు తాకీదు పంపించాడు, దానితో బుక్క రాయలు కోపితుడై బహుమనీ రాజ్యమునందున్న ముద్గల్లు కోటను ఆక్రమించాడు. బహుమనీ సేనలు విజయనగర సైన్యమును ఎదుర్కొని, ఆదవాని, కౌతల ప్రాంతములందు జరిగిన యుద్ధములందు విజయనగర సైనికులను ఓడించినాయి. ఈ యుద్ధమున సాధారణ ప్రజానీకానికి అనేక కష్టాలు ప్రాప్తించినాయి. వేలకొలదీ ప్రజలు నిరాశ్రయలు అయినారు. వందల కొలది అమాయకులు ప్రాణాలు కోల్పోయినారు. చివరకు బుక్క రాయలు సుల్తానుతో  సంధి షరతులను అనుసరించి, ఇరువురూ సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ఖేధమూ కలిగించకూడదని సంధి చేసుకొనినాడు.


రెండవ యుద్దము


మొదటి యుద్ధము తరువాత 1375 వరకూ యధాస్థితి కొనసాగినది. కానీ 1375 వ సంవత్సరమున మహమ్మద్ షా దివంగతులయినారు. తరువాత అతని వారసుడు ముజాహిద్ షా సింహాసనము అధిరోహించాడు. ఈ సమయములో బుక్క రాయలు కృష్ణా నది, తుంగభద్రా నది ప్రాంతముల మధ్య నున్న ప్రదేశమును ఆక్రమించెను. అంతే తిరిగి మరో యుద్ధము ప్రారంభమయినది. ఈ యుద్ధమున విజయనగర సైనికులు ఓడిపొయినారు. బహుమనీ సైనికులు విజయ నగర సైనికులను తుంగభద్రా నది దాటువరకూ తరిమివేసినారు.


కవులు


ఉత్తర హరివంశమునకు కర్త అయిన నాచన సోమన వీరి ఆస్తానంలోని వాడే!


మంత్రి


బుక్క రాయలకు మంత్రిగా అసాధారణ మేథా సంపత్తి కలవాడుగా పేరుగాంచిన మాధవులు, వీరి గురువుగారు విద్యారణ్యస్వామి.



రెండవ హరిహర రాయలు (1377-1404)


రెండవ హరిహర రాయలు, మొదటి బుక్క రాయలు మరణానంతరము 1377లో సింహాసమునకు వచ్చాడు.


సామంత రాజ్యాల పునరాధీనము


మొదటి బుక్క రాయలు కుమారుడైన కంప రాయలే ఈ పేరుతో రాజ్యమునకు అధిపతి అయినాడని ఓ అభిప్రాయము. ఇతను రాగానే చేసిన మొదటి పని, తన తండ్రి గారి కాలములో సామంతులుగా నియమితులైన అనేక రాజ బంధువులను స్వతంత్రులు కావాలెననెడి అభిలాషనుండి మరల్చి, వారిని తొలగించి, తన పుత్రులను నియమించాడు. ఉదయగిరికి దేవ రాయలును, మధుర ప్రాంతములకు విరూపాక్ష రాయలును అధికారులుగా నియమించాడు.

బిరుదులు


రాజాధిరాజు , రాజపరమేశ్వర

యుద్దములు

మొదటి తరం విజయనగర రాజులకు బహుమనీ సుల్తానులతో యుద్ధాలు తప్పలేదు. రెండవ తరం రాజులకు గజపతులతోనూ, నాలుగు బహుమనీ సుల్తాను శాఖలతోనూ యుద్ధాలు తప్పలేదు. 1378లో బహుమనీ సుల్తాను ముజాహిద్ షా దారుణంగా హత్యచేయబడినాడు. బహుమనీ రాజ్యం అంతఃకలహాలకు ఆలవాలమయినది. 1378 నందే రెండవ మహమ్మద్ షా సింహాసనము అధిష్టించాడు. ఇతను శాంతిశీలుడు. ఈ కాలములో దక్షిణభారతదేశములో పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. కొండవీడు రెడ్డిరాజ్యమున పెదకోమటి వేమారెడ్డి, కుమార గిరి రెడ్డి, కాటయవేమా రెడ్డి ల మధ్య తరచూ యుద్ధములు జరుగుతుండేవి. ఇదే సమయములో రేచర్ల పద్మనాయకులు బహుమనీ సుల్తానులతో స్నేహం చేసుకొని విజయనగర, కొండవీడు రాజ్యములను ఆక్రమించాలని పథకం రూపొందించారు. ఇటువంటి పరిస్థితులలో రెండవ హరిహర రాయలు కొండవీడు రాజ్యమందున్న శ్రీశైలం ప్రాంతమును ఆక్రమించారు. కానీ కాటయవేమా రెడ్డి విజయనగర సేనలను ఎదుర్కొని ఓడించాడు. హరిహర రాయలు కాటయవేమునితో సంధిచేసుకొని అతని కొడుకు కాటయకూ తన కూతురు లక్ష్మికి వివాహం జరిపించాడు.

మోటుపల్లి యుద్దం

హరి హర రాయలు కుమారుడైన దేవ రాయలు ఉదయగిరి అధిపతి . అతడు సైన్యముతో మోటుపల్లి రేవును ఆక్రమించాడు. తరువాత కొండవీడు రాజ్యముపైకి హరిహర రాయలు చౌండసేనానిని పంపించాడు. ఇదే సమయంలో కొండవీడును కుమారగిరి రెడ్డి నుండి స్వాధీనము చేసుకున్న పెదకోమటి వేమా రెడ్డి విజయనగర సైనికులను కొండవీడు భూబాగాలనుండి తరిమివేశాడు.


పద్మనాయకులతో యుద్దములు


మొదటి దండయాత్ర


హరిహర రాయలు పద్మనాయకులపైకి తన పెద్ద కుమారుడూ, యువరాజు అయిన రెండవ బుక్కరాయలును పంపించాడు, ఈ యుద్ధములో సాళువ రామదేవుడు అను యోధుడు చాలా ప్రముఖ పాత్ర వహించాడు. ఈ దండయాత్రను ఎదుర్కోవడంలో పద్మనాయక ప్రభువులకు బహుమనీ సుల్తానులు సహాయం చేసారు. కొత్తకొండ ప్రాంతమున జరిగిన పోరాటంలో సాళువ రామదేవుడు ప్రాణాలకు తెగించి పోరాడి, చివరకు తన ప్రాణాలు అర్పించాడు. రెండవ బుక్క రాయలు ఓటమిభారంతో విజయనగరం తిరిగి వచ్చాడు.


రెండవ దండయాత్ర


1397లో మరలా రెండవ హరిహర రాయలు, గండదండాధీశుడు వంటి అనేక వీరులను, పెద్ద సైన్యమును, తోడుగా ఇచ్చి యువరాజు రెండవ బుక్క రాయలును మరల పద్మనాయకులు పైకి దండయాత్రకు పంపించాడు. ఇదే సమయలో దేవరాయలు మరికొంత సైన్యముతో అలంపురం పైకి దండెత్తినాడు. ఈ దండయాత్రలను పద్మనాయకులు, బహుమనీల సహాయంతో ఎదుర్కోవాలని చూసినారు, కానీ విజయనగర రాజ సైనికులు కృష్ణా నది ఉత్తరభాగమున ఉన్న పానుగల్లు కోటను ముట్టడించి వశము చేసుకున్నారు, అలాగే చౌల్ దాలోల్ ప్రాంతమును విజయనగర సైనికులు సాధించారు.


సింహళ దేశ విజయ యాత్ర


విరూపాక్ష రాయలు గొప్ప నావికా సైన్యమును అభివృద్ధిచేసి సింహళ ద్వీపముపైకి దండయాత్రచేసి విజయం సాధించి సింహళ రాజునుండి కప్పమును తీసుకోని వచ్చాడు. ఈ విజయము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భారత దేశ చరిత్రలో ఓ అపవాదు ఉన్నది, కేవలము బ్రిటీషువారికి మాత్రమే నావికాదళము కలదు అని. కానీ దానికంటే ఎంతో ముందే భారతదేశ ప్రభువులు చక్కని నావికాదళమును రూపొందించారు.


కొండవీడు యుద్దాలు

పైన చెప్పుకున్నట్లు కొండవీడు విషయములలోనూ, వారి అంతఃకలహాలలోనూ విజయనగరరాజులు జోక్యము చేసుకున్నారు. కొన్ని ప్రాంతములు ఆక్రమించ ప్రయత్నించారు. చివరకు కాటయ వేమా రెడ్డి వీరికి సహాయము చేసాడు.


కరువు


ఈ రాజు పరిపాలనా కాలమున దేశమునందు  పెద్ద కరువు ఏర్పడినట్లు తెలుస్తున్నది.

గురువు

వీరికి కూడా విద్యారణ స్వామివారే గురువుగా ఉన్నారు. అంతే కాకుండా వీరే మంత్రిగా ఉన్నారు కూడా!

ఇతని వారసుడు

నియమాల ప్రాకారం ఇతని పెద్ద కుమారుడైన రెండవ బుక్క రాయలు ఇతని తరువాత రాజు కావలెను, కానీ అప్పటికే గొప్ప సైన్యము కలవాడూ, సింహళమును జయించినవాడు అయిన విరూపాక్ష రాయలు సింహాసనము బలవంతముగా ఎక్కి, ఒక సంవత్సరము పాలించాడు, కానీ రెండవ బుక్క రాయలు తన విధేయులతోనూ, సామంతులతోనూ వచ్చి సింహాసనం స్వాధీనం చేసుకున్నాడు, కానీ ఇతను కూడా సంవత్సరమే పాలించాడు. తరువాత మొదటి దేవరాయలు ఉదయగిరి దుర్గము నుండి సైన్యముతో వచ్చి సింహాసనం అధిష్టించి, 16 సంవత్సరములు మరణము వరకూ విజయవంతమైన పరిపాలన చేసాడు.


విరూపాక్ష రాయలు (1404-1405)


రెండవ హరిహర రాయలు కుమారుడైన, విరూపాక్ష రాయలు తన అన్నగారు అయిన రెండవ బుక్క రాయలుకు రావలసిన రాజ్య సింహాసనాన్ని అపహరించాడు. కానీ ఇతను ఎక్కువ కాలం రాజ్యము చేసుకొనలేకపొయినాడు. ఒక సంవత్సరము తరువాత రాజ్యాన్ని సామంత, విధేయుల సహాయంతో రెండవ బుక్క రాయలు స్వాధీనం చేసుకున్నాడు. ఇతని గురించి చెప్పుకోవలసిన విజయం తన తండ్రిగారి హయాములో సింహళ ద్వీపంపైన సాధించింది. దాని గురించి రెండవ హరిహర రాయలు వద్ద చదవండి.



రెండవ బుక్క రాయలు    (1405-1406)


రెండవ బుక్క రాయలు రెండవ హరిహర రాయలు పెద్ద కొడుకు, సింహాసనానికి వారసుడు, కానీ తన తముడైన విరూపాక్ష రాయలు సింహాసనాన్ని ఆక్రమిస్తే, విధేయులు, సామంతులతో కలిసి స్వాధీనం చేసుకుంటాడు, కానీ మరొక తమ్ముడైన మొదటి దేవరాయలు అన్నగారిని తొలగించి సింహాసనాన్ని ఆక్రమించాడు.


ఇతని గురించి చెప్పుకోవలసినది, ఇతను తండ్రిగారి హయాములో చేసిన పద్మనాయకులపై దండయాత్రలు వీటిగురించి రెండవ హరిహర రాయలు వద్ద చదవండి.



మొదటి దేవ రాయలు (1406-1422)


మొదటి దేవ రాయలు రెండవ హరిహర రాయలు కుమారుడు. తన అన్నగారినుండి రాజ్యమును బలవంతముగా స్వాధీనము చేసుకున్నాడు.


యుద్దములు

ఫిరోద్ షా తో తొలి యుద్దం

సింహాసనము ఆక్రమించిన తొలిరోజులలోనే, విజయనగర రాజ్య అంతఃకలహాలను ఆసరాగా చేసుకొని ఫిరోద్ షా విజయనగరమును ముట్టడించి, ఓడించి 32 లక్షల రూపాయలను తీసుకోనిపోయినాడని సయ్యదలీ వ్రాతల వలన తెలియుచున్నది.


రెడ్డి రాజులు, బహుమనీలపై విజయాలు

కందుకూరును పరిపాలిస్తున్న రెడ్డి రాజులు, ఉదయగిరి రాజ్యమందున్న పులుగునాడు, పొత్తపినాడులను జయించి తమ రాజ్యమున కలుపుకున్నారు. ఉదయగిరి దేవరాయలకు తండ్రి ఆధీనము చేసిన దుర్గము. ఈ సమయములో దేవరాయలు, రాజమహేంద్రవరంను పరిపాలిస్తున్న కాటయవేమునితో సంధి చేసుకున్నాడు. వీరు ఇద్దరూ కలసి కొండవీటికి చెందిన పెద కోమటి వేమునితో, అతని స్నేహితుడగు అన్న దేవ చోడునితో, బహుమనీ ఫిరోద్ షా తోనూ యుద్ధము చేసారు.


దేవ రాయని మిత్రుడైన కాటయ వేముడు, పెద కోమటి వేముడుతో యుద్ధం చేస్తూ వీరమరణం పొందినాడు. దానితో దేవరాయడు రాజమహేంద్రవరం అధిపతిగా కాటయవేముని కుమారుడైన, పది సంవత్సరముల ప్రాయం వాడైన రెండవ కుమార గిరిని కూర్చొనబెట్టి, అల్లాడ రెడ్డి, అతని కుమారులు వేమ, వీర భద్రా రెడ్డి లుతో కలసి శతృవులైన ఫిరోద్ షా, పెద కోమటి వేమా రెడ్డి సైన్యాన్ని ఓడించి రాజమహేంద్రవరం పై అల్లాడరెడ్డి ఆధిపత్యాన్ని నిలబెట్టినాడు.

ఇటువంటి ఓటమి తరువాత ఫిరోద్ షా పానుగల్లు దుర్గమును ఆక్రమించాడు. కొండవీడు, బహుమనీ ల స్నేహాన్ని చూసి కీడు శంకించిన పద్మ నాయకులు విజయనగరాధిపతితో స్నేహం చేసుకొని పానుగల్లు దుర్గమును ఫిరోద్ షా నుండి కాపాడటానికి రెండు సంవత్సరములు యుద్ధము చేసాడు.

ఇటువంటి సమయంలో దేవరాయలు వ్యూహాత్మకంగా బహుమనీ సుల్తానులకు కొండవీడు నుండి ఎటువంటి సహాయం రాకుండా చేయడానికి సైన్యాన్ని ఏకకాలంలో తీరాంధ్రప్రదేశాన్ని ఆక్రమించడానికి పంపించాడు. ఈ సైన్యము చాలా అమోఘమైన పురోగతి సాధించి పొత్తపినాడు, పులుగులనాడు లను ఆక్రమించి మోటుపల్లి రేవు పట్టాణాన్ని ముట్టడించింది. విజయనగర ప్రభువులు ఈ రెండు యుద్ధములందూ విజయాలు సాధించి బహుమనీ సుల్తానులనూ, కొండవీడు రాజులనూ ఓడించి నల్గొండ, పానుగల్లు, తీరాంధ్ర మొత్తం విజయనగర సామ్రాజ్యములో విలీనం చేశారు.

ఇతర విశేషములు

మొదటి దేవరాయలు ఈ స్ఫూర్తివంతమైన విజయములతో పాటూ, తన రాజధాని నగరాన్ని చక్కగా పటిష్ఠ పరిచాడు, కోట గోడలూ, బురుజులూ కట్టించాడు, తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టినాడు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసాడు. ఇతను సాధించిన విజయాలు తరువాత తరువాత విజయనగరాన్ని ఉన్నతస్థానంలో ఉంచడానికి చాలా తోడ్పడినాయి.

కవులు

జక్కన అను కవి విక్రమార్క చరిత్రను ఈ కాలముననే రచించాడు



రామచంద్ర రాయలు (1422-1422)


 మొదటి దేవ రాయలు కుమారుడు. 1422లో విజయనగర సింహాసనం అధిస్టించాడు. కానీ నాలుగునెలలు మాత్రమే పరిపాలన చేసాడు, తరువాత ఇతని తమ్ముడువీర విజయ రాయలు ఇతనిని తొలిగించి సింహాసనం అధిస్టించాడు.

ఈయన తన తండ్రి మొదటి దేవ రాయలు పాలనాకాలములో ఉదయగిరి ప్రాంతానికి అధిపతిగా ఉన్నాడని కనిగిరి తాలూకా దాదిరెడ్డిపల్లెలోని 1416వ సంవత్సరపు శాసనము వల్ల తెలుస్తున్నది.





వీర విజయ బుక్క రాయలు (1422-1424)



ఇతను మొదటి దేవ రాయలు రెండవ కుమారుడు. తన అన్న దగ్గరనుండి రాజ్యమును అపహరించాడు, కానీ అసమర్థుడుగా పేరుగాంచాడు, నామమాత్రమే సింహాసనముపై ఉండి, అధికారం మొత్తం తన కుమారుడైన రెండవ దేవ రాయలుకు అప్పగించాడు.



రెండవ దేవ రాయలు (1424-1446)



రెండవ దేవ రాయలు వీర విజయ బుక్క రాయలు కుమారుడు, దేవ రాయలు యొక్క మనుమడు. ఇతను తండ్రి పాలనలోనే పగ్గాలు చేతబట్టినవాడు, సమర్థుడు, అధికార దక్షుడు, ఏనుగులు వేటాడటంలో నేర్పరుడు. ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యం చాలా ప్రసిద్ధి చెందినది, నాలుగు చెరగులా వ్యాపించింది. దేశము సుసంపన్నము అయినది.

యుద్దములు


ఇతని కాలమునాటికి కొండవీడు బలహీనమైనది, దీనిని ఆసరాగాతీసుకోని తీరాంధ్రను జయించి, 1424 నాటికి కొండవీడు రాజ్యము అంతరించినది, అనేక చిన్న చిన్న సామంత దండనాయకులు స్వతంత్రించారు. రెండవ దేవరాయలు తీరాంధ్రపైకి దిగ్విజయ యాత్రచేసి నరసరావుపేట, ఒంగోలు లను పంట మైలారరెడ్డిని ఓడించి స్వాధీనం చేసుకున్నాడు. పొదిలిని ఏలుతున్న తెలుగు రాయలును ఓడించాడు. చివరికి వారిని తమ సామంతులుగా స్వీకరించాడు. ఇక్కడ ఓ ముఖ్య విషయం ఏమిటంటే ఈ తెలుగు రాయలు సాళువ వంశమునకు చెందినవాడు.


అలాగే దిగ్విజయ యాత్రను సాగించుతూ 1428 వ సంవత్సరమున కొండవీడు దుర్గమును జయించాడు, తరువాత సింహాచల ప్రాంతములను వానియందలి పర్వత ప్రాంత భూభాగములను విజయనగర రాజ్యమున విలీనం చేసాడు.


గజపతులతో యుద్దాలు


1444లో కళింగ అధిపతులైన కపిలేశ్వర గజపతి తీరాంధ్రముపైకి దండయాత్రకు వచ్చాడు, అతడు రాజమహేంద్రవరం వరకూ వచ్చాడు, కానీ తరువాత రెండవ దేవరాయలు పంపించిన మల్లపవడయ చమూపతి ఈ దురాక్రమణను తిప్పికొట్టినాడు.


ఈ కాలమునాటికి దక్షిణ భారతమంతయూ విజయనగరాధీనములోనికి వచ్చింది.


జాఫ్నాపై యుద్దం


లక్కన్న అను దండనాయకుని సారథ్యంలో దేవరాయ సైన్యం జాఫ్నా పై దండెత్తి కప్పమును స్వీకరించెను. రెండవ దేవరాయ రాజ్యము సింహళము నుండి గుల్బర్గ వరకూ, ఓడ్ర దేశము నుండి మలబారు తీరము వరకూ వ్యాపించింది.


బహుమనీ సుల్తానులతో యుద్దములు


బహుమనీ సుల్తాను అహ్మద్ షా గొప్ప సైన్యమును ఏర్పాటుచేసుకుని దండెత్తి తొలి సారి విజయం సాధించాడు. తరువాత అతడు పద్మనాయకులుపై దండెత్తినాడు, కానీ సరి అయిన సమయానికి విజయనగర సైన్యం రానికారణంగా పద్మనాయకులు ఈ యుద్ధమున ఓడిపొయినారు. అప్పటినుండి పద్మనాయకులూ, విజయనగరాధీశులూ మరల శతృత్వము వహించారు.


ఈ సారి దేవరాయలు 1443నందు బహుమనీ రాజ్యముపై దండెత్తి ముద్గల్లు, బంకాపూర్, రాయచూర్, లను స్వాధీనం చేసుకుని బీజాపూర్, సాగర్ లపైకి సైన్యమును నడిపినాడు. ఈ యుద్ధం అతి భయంకరంగా రెండు నెలలు జరిగినది, ఇరువైపులా చాలా నష్టాలు కలిగినాయి, చివరకు సంధి కుదిరినది, బహుమనీ, విజయనగర రాజ్యాల మధ్య కృష్ణా నది ఎల్లలుగా గుర్తించబడినాయి.


ఇతని సైన్యము


ఇతని సైన్యము చాలా బలవంతమైనది, ఇతను చక్కని ముస్లిం సైనికాధికారులను పిలిపించి తన సైన్యానికి శిక్షణ ఇప్పించాడు. తన సైన్యంలో రెండువేలమంది ముస్లింలను చేర్చుకున్నాడు. (ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదాలకు దారితీసినది, ఎందుకంటే అచ్యుతరాయల కాలం నాటికి సైన్యంలో ముస్లింల సంఖ్య చాలా పెరిగినది, కానీ వారు రాక్షస తంగడి యుద్దమున అచ్యుత రాయలకు వెన్నుపోటుపొడిచి యుద్ధంలో రాయల మరణానికీ, తద్వారా విజయనగర పతనానికీ హేతువులలో ఒకరుగా నిలిచారు)


ఇతని సైన్యంలో రెండు లక్షల కాల్బలము, 80 వేల అశ్విక దళము, 60 వేల ధనుర్విద్య విశారదులూ ఉండేవారు.


మతము


ఇతను శైవమతాభిమాని, పరమత సహనము కలవాడు, ఈ కాలములో అందరికీ ఆలయములు నిర్మించాడు, ముఖ్యముగా జైనులకూ, ముస్లింలకూ, వైష్ణవులకూ, శైవులకూ ఆలయములు నిర్మించాడు.


సాహిత్యము


ప్రసిద్ధ డిండిమ భట్టారకుడు ఈ కాలమునందలివాడే, ఇతనినే శ్రీనాథుడు ఓడించి కవిసార్వభౌమ బిరుదును తీసుకున్నాడు. కంచు డక్కను పగల గొట్టినాడు.


రాయబారులు


పర్షియా నుండి అబుల్ రజాక్ ఈ కాలంనాడే రాయబారిగా వచ్చాడు.

ఇటలీ యాత్రికుడు కౌంటే ఈ కాలంలోనే వచ్చాడు.

విజయ నగరము


ఇది ఏడు ప్రాకారములు కలది, ప్రాకారముల మధ్యలో పంట పొలాలు ఉన్నాయి. దీని చుట్టుకొలత సుమారుగా 100 కిలోమీటర్లు.


పండుగలు


ఆనాటి పండుగలు చాలా ఉత్సాహంతో జరుపుకునేవారు, ముఖ్యముగా దీపావళి, శివరాత్రి, వసంతోత్సవములు ఘనంగా జరుపుకునేవారు.


రాజ్య విశేషములు


ఇందు 300 ఓడరేవులు ఉన్నాయి. సామ్రాజ్యము ధనవంతమైనది. విజయనగరము చాలా అద్భుతంగా ఉండెడిది. రాజప్రాసాదము అత్యున్నతమైనది, మనోహరమైనది, నగర వీధులందు స్వర్ణరత్నాభరణములు, వజ్రవైడూర్యములు రాసులుగా పోసుకుని అమ్ము వర్తక శ్రేష్ఠులు ఉన్నారు, సామ్రాజ్య ప్రజలు విలాసమయ జీవితము గడిపేవారు.





మల్లికార్జున రాయలు (1446-1465)



 మల్లికార్జున రాయలు తన తండ్రి రెండవ దేవ రాయలు తరువాత అధికారములోకి వచ్చాడు, ఇతడు అంత సమర్థుడుగా పేరుగాంచలేదు, తాత తండ్రుల రాజ సంపదను కొంత బహుమనీ సుల్తానులకు, మరికొంత గజపతులకు సమర్పించాడు.గజపతుల మొదటి దడయాత్రకపిలేశ్వర గజపతి పద్మనాయకుల సహాయముతో 1448న తీరాంధ్రపైకి దండెత్తివచ్చి రాజమహేంద్రవరమును ఆక్రమించాడు. తరువాత ఇంకా ముందుకు సాగి 1450లో కొండవీడును జయించాడు. అద్దంకి, శ్రీశైలము, వెలుగోడు, బెల్లంకొండలను జయించి, తరువాత విజయనగరంను ముట్టడించాడు, మల్లికార్జున రాయలు సంధి చేసుకుని అపరాధరుసుము చెల్లించాడు.గజపతుల రెండవ దడయాత్ర1464 వ సంవత్సరమున, గజపతులు కపిలేశ్వర గజపతి, గొప్ప సైన్యాన్ని ఇచ్చి హంవీర గజపతి సైన్యాధిపతిగా విజయనగరంపైకి దండయాత్రకు వచ్చి కాంచీ నగరము వరకు ఆక్రమించెను, ఇతను చంద్రగిరి, ఉదయగిరి, కొండపల్లి, వినుకొండ, అద్దంకి, తిరుచానూరు, తిరుచనాపల్లి మొదలగు ప్రాంతములను గజపతుల ఆధీనములోకి తెచ్చాడు.మొత్తానికి ఈ రాజు చాలా అసమర్థుడైనాడు. 





రెండవ విరూపాక్ష రాయలు (1465-1485)












రెండవ విరూపాక్ష రాయలు, ఇతను రెండవ దేవ రాయలు సోదరుడగు వీరవిజయ రాయలు కుమారుడు. ఇతను శతృవులను జయించి రాజ్యమునకు వచ్చాడు, ఇతడు అంత సమర్థుడు కాకున్ననూ, శక్తివంతమైన సామంతులూ, వారి పోరాటాలు సహాయముగా గజపతులను కళింగ వరకూ తరిమినాడు. ముఖ్యముగా పెనుగొండను ఏలుతున్న సాళువ నరసింహ రాయ భూపతి ఇందు ప్రముఖ భూమికను పోషించాడు.


ఈ రాజు రాజవ్యసనమునకు అలవాటు అయి, దుష్టబుద్ధి కలిగి అవకతవక పనులు చేయుచు రాజ ప్రతిష్ఠ మంట కలిపెను. ఇతని పాలనను చూడలేక కుమారుడే తండ్రిని హతమార్చెను.


 క్రీ.శ. 1481 లో రెండవ విరూపాక్ష రాయలు వేసిన శిలాశాసనం తమిళనాడు లోని తిరువణ్ణామలై జిల్లా వెల్లూర్ కోట ASI మ్యూజియం లో ఉంది.



ప్రౌఢ రాయలు (1485-1485)


 ప్రౌఢరాయలు, విరూపాక్షరాయల రెండవ కుమారుడు. సోదరుడగు రాజశేఖర రాయలను సంహరించి 1485లో అధికారానికి వచ్చాడు, ఇతను క్రూరుడు, దుర్మార్గుడు, దుర్బలుడు, విలాసవంతమైన జీవితములకు అలవాటుపడినాడు. సామంత, మాండలీకులు ఇతని కుచిత చర్యలకు ఆశ్చరచకితులై సాళువ నరసింహరాయ భూపతినకు అండగా నిలిచి, ఇతనిని సింహాసనంనుండి దించివేసినారు. ఈ తిరుగుబాటునకు తుళువ నరసనాయకుడు నాయకత్వం వహించాడు.


ముఖ్యమైన విషయము ఏమిటంటే, ఇతనితో సంగమవంశ పాలన అంతమైనది, మహోన్నత ఆశయంతో హరిహర బుక్క రాయలతో ప్రారంభమైన ఈ వంశ పాలన చివరకు అసమర్థులైన రాజుల వల్ల, విలాస జీవితం వల్లా నాశనం అయిపోయింది. మరొక ముఖ్యమైన విషయము ఏమిటంటే, రాజు చెడ్డవాడైతే విజయనగర సామంతాది మంత్రివరులు వారిని పదవీచ్యుతులు చేయు ఆచారము కలదు, కొద్దిగా ప్రజాస్వామ్య లక్షణాలు కనిపిస్తాయి.





సాళువ వంశము


సాళువ వంశము విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన రెండవ వంశము. ఈ వంశస్థులు 1485 నుండి 1505 వరకు విజయనగరాన్ని పాలించారు. సాళువ వంశము కన్నడ వంశము. ఈ వంశస్థులు కళ్యాణీపురవరాధీశ్వర అనే బిరుదు ధరించడము వలన కర్ణాటకలోని కళ్యాణీ నగరము వీరి జన్మస్థలమని చరిత్రకారుల అభిప్రాయము. ముస్లింల దండయాత్రలవలన ఆంధ్ర దేశానికి వలస వచ్చారు. వీరి రాజకీయ ప్రాభల్యము కర్నూలు, చంద్రగిరి ప్రాంతాలలో ప్రారంభమైనది.


సాళువ వంశ స్థాపకుడు, సాళువ నరసింహుని ప్రపితామహుడు (ముత్తాత) మంగిరాజుకు ప్రతిపక్ష సాళువ అనే బిరుదు ఉంది. బిరుదనామమే వంశనామమయ్యిందని ఒక ఆలోచన. వీరి పూర్వీకులకు కూడా కటారిసాళువ అనే బిరుదు ఉంది. అయితే వీరి అసలు వంశనామము తెలియదు.


సాళువాభ్యుదయము గ్రంథమును అనుసరించి కంపరాయల మధురాపురి దండయాత్రలో, శ్రీరంగనాథుని పునప్రతిష్ఠించుటలో సాళువ మంగిరాజు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈయన శ్రీరంగనాథునికి 60వేల మాడలు, 8 గ్రామాలు దానము చేశాడు. అప్పటి నుండి సాళువ వంశస్థులు కర్నూలు, చంద్రగిరి ప్రాంతాలను విజయనగర ఉద్యోగులుగా పాలించినట్లు స్థానిక చరిత్రలు, శాసనాలు చెబున్నాయి కానీ సాళువాభ్యుదయము ప్రకారము సాళువ నరసింహుని తండ్రి గుండరాజు కళ్యాణీ నుండి పాలించాడని చెబుతున్నది. గుండరాజు మరణానంతరము కళ్యాణీ నగరానికి విపత్తు సంభవించగా నరసింహదేవ రాయలు రాజధానిని చంద్రగిరికి మార్చాడట.


సాళువ నరసింహ దేవ రాయలు (1485-1491)


ఇతను పెనుగొండ దుర్గాధిపతి, అప్పటికే సంగమ వంశము క్షీణ దశలో పడి రాజ్య భాగాలు కాకులు పాలైనట్లు అటు గజపతులూ, ఇటు బహుమనీ సుల్తానులూ లాక్కోసాగినారు, నేరుగా సామ్రాజ్యమునకు గుండెవంటి విజయనగరము పైకి దండెత్తి వచ్చి ఓడించి కప్పాలు తీసుకొని పోయినారు. దీనితో సాళువ నరసింహ రాయ భూపతి, తన ధైర్య సాహసములతో పోరాటాలు చేసి రాజ్యభూభాగాలు రక్షించ ప్రయత్నించాడు.

ఉదయగిరికి స్వాతంత్ర్యము తెచ్చుట

1470నందు నరసింహరాయలు ఉదయగిరి పై దండెత్తి అక్కడి రాజప్రతినిధిఅయిన కంటంరాజు తమ్మరాజును ఓడించాడు. దీనితో కపిలేశ్వర గజపతి కోపించి, కుమారునితో కలసి ఉదయగిరి పైకి దండెత్తినాడు, కానీ నరసింహరాయలు శక్తి సామర్ద్యాలముందు ఓడిపోయి ప్రాణాలు కోల్పోయినాడు. ఇదే అదనుగా నరసింహరాయలు తమ తీరాంధ్ర భూభాగాలను గజపతులనుండి పునస్వాధీనము చేసుకున్నాడు.

బహుమనీ సైనికులను ఓడించుట




తరువాత గజపతులు అంతఃకలహాలతో రాజ్య భూభాగాలను బహుమనీలకు కోల్పోయినారు. ఈ సమయంలో చాలా యుద్ధాల తరువాత బహుమనీ సుల్తాన్ మూడవ మహమ్మద్ షా దండయాత్రకు బయలుదేరి రాజమహేంద్రవరమును గజపతుల నుండి ఆక్రమించి, కొండవీడును జయించి, కాంచీపురంను జయించి, విశేష ధనంతో,వజ్ర వైడూర్య రత్నఖచిత మణి మయ  ఆభరణాలతో తిరిగి వెళ్లసాగినాడు.

ఇక్కడే నరసింహ రాయ భూపతి తెలివిగా ప్రవర్తించాడు, తుళువ ఈశ్వర నాయకుడు అను గొప్ప శూరుడైన సేనానిని పంపి కందుకూరు వద్ద బహుమనీ సైనికులను ఓడించి మొత్తం ధనుమును స్వాధీనము చేసుకున్నాడు. దీనితో పెనుగొండ సిరిసంపదలతో తులతూగసాగినది.



మచిలీ పట్నం ఆక్రమణ



తరువాత స్వయంగా నరసింహరాయలు మచిలీపట్నంపైకి దండయాత్రకు వెళ్లి ఆక్రమించుకున్నాడు.



బహుమనీ ప్రతీకారం

బహుమనీ సుల్తానులు ఓటమికి బాధపడి మరల గొప్పసైన్యంతో దండయాత్రకు బయలుదేరి మచిలీపట్నం జయించి పెనుగొండను మాత్రం ఏమీ చేయలేకపొయినారు.



విజయనగర సింహాసనం అధిష్టించుట


సంగమ వంశీయులు చేతకానివారు, చేవ చచ్చి, వ్యసనపరులై, సామంతుల నమ్మకాన్ని కోల్పోయినారు. సామంతుల కోర్కెపై సింహాసనం అధిష్టించాడు.
సింహాసనం అధిష్టించగానే సామంతుల తిరుగుబాటు అణిచివేసినాడు. తరువాత ఉదయగిరి యుద్ధములో ఓడిపోయి దానిని గజపతులస్వాధీనము చేసాడు.

వారసులు

ఇతనికి ఇద్దరు కుమారులు, చివరి క్షణాలలో తన సేనాని అయిన తుళువ నరసనాయకునికి, కుమారులనూ రాజ్యాన్ని అప్పగించి ఎలాగైనా గజపతులు, బహుమనీల ఆధీనంలోని విజయనగర రాజ్య ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోమన్నాడు.

తిమ్మ భూపాలుడు (1491-1491)

తిమ్మ భూపాలుడుసాళువ నరసింహ రాయలుగారి పెద్ద కుమారుడు, తన ప్రభువునకు ఇచ్చిన మాట ప్రకారం తుళువ నరస నాయకుడు ఇతనిని సింహాసనాధిష్టుని చేసి రాజ్యభారం తానే వహించాడు, కానీ ఆరు నెలలలోనే ఇతను మరణించాడు.

రెండవ నరసింహ రాయలు (1491-1505)

ఇతను సాళువ నరసింహదేవ రాయలు రెండవ కుమారుడు, అన్నగారు అయిన తిమ్మ భూపాలుడు మరణించిన పిదప ఇతను రాజ్యాధిపతి అయినాడు, కానీ తుళువ నరస నాయకుడు ఇతనిని పెనుగొండ దుర్గమున గృహనిర్భంధమున ఉంచి రాజ్యమునకు తానే అధిపతి అయినాడు. తరువాత తుళువ నరస నాయకుని కుమారుడు అయిన వీరనరసింహ రాయలు ఆ భాగ్యము కూడా ఎంతోకాలం లేకుండానే ఇతనిని చంపి తానే రాజు అయినాడు.


 తుళువ వంశము


తుళువ వంశము విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మూడవ వంశము. కర్ణాటకలోని తుళు  వీరి జన్మస్థలమైనందున తుళువ వంశమనే పేరు వచ్చింది. హరిహర రాయలు 1342 ప్రాంతములో తుళునాడును జయించినప్పటినుండి ఈ వంశస్థులు విజయనగర ఆస్థానములో రాజోద్యోగాలు నిర్వహిస్తూ ఉన్నారు. సాళువ వంశస్థులవలెనే వీరూ తమది చంద్రవంశమని వర్ణించుకున్నారు. ఈ వంశానికి మూలపురుషుడు తిమ్మరాజు. ఇతని కొడుకు ఈశ్వర నాయకుడు సాళువ నరసింహుని సేనాపతిగా 1481లో మహమ్మద్ షాను కందుకూరు వద్ద ఓడించి అతడి శిబిరాన్ని దోచుకున్నాడు. వరాహపురాణం ఇతణ్ణి దేవకీపురాధిపుడని వర్ణిస్తున్నది. ఉత్తర ఆర్కాటు జిల్లా ఆరణి తాలూకాలోని దేవికాపురమే దేవకీపురమై ఉంటుంది. ఈ వాదనను బలపరుస్తూ అక్కడి బృహదాంబాలయంలో తుళువ వంశస్థులకు చెందిన అనేక శాసనాలు లభించాయి. ఈ ఈశ్వరనాయకుడే శ్రీకృష్ణదేవరాయల పితామహుడు. ఈశ్వరనాయకుని కుమారుడు నరసానాయకుడు. కృష్ణరాయలను ఆయన ఆస్థానకవి అల్లసాని పెద్దన సంపెట నరపాల అని వర్ణించాడు, దీన్ని బట్టి వీరి ఇంటిపేరు సంపెట అయి ఉండవచ్చని భావిస్తున్నారు.


తుళువ వంశస్థుల మాతృభాష కన్నడమైనా తెలుగు భాషను అభిమానించి ఆదరించారు. జంటకవులు నంది మల్లయ్య, ఘంట సింగయ్యలు రచించిన వరాహపురాణాన్ని నరసానాయకుడు అంకితం పొందినాడు. ఈయన కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు తెలుగు అభిమానం జగద్విదితం. అయినా వీరికి తాము కన్నడిగులమన్న మాతృభాషా భావం లేకపోలేదు. కృష్ణరాయలు ఆంధ్ర మహావిష్ణువు తనను కన్నడరాయ అని సంబోధించాడని గర్వంగా చెప్పుకున్నాడు.

సాళువ వంశపు చివరి రోజుల్లో సరసానాయకుడు రాజ్యపాలన నిర్వహించినా అధికారికంగా పట్టాభిషిక్తుడై విజయనగర సామ్రాజ్యంలో తుళువ వంశ పాలనకు నాంది పలికింది.నరసానాయకుని పెద్దకొడుకు వీరనరసింహ రాయలు.

తుళువ నరస నాయకుడు (1491-1503)
తుళువ నరస నాయకుడు సాళువ నరసింహదేవ రాయలు వద్ద సేనాని, ఇతను బహుమనీలనుండి ఎంతో ధనాన్ని నేర్పుగా కొల్ల గొట్టినాడు. ఇతడు నరసింహదేవ రాయలును సింహాసనాధిస్టులను చేయడంలో ప్రముఖ పాత్ర వహించాడు. తుళువ నరస నాయకుడు బంట్ అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడు.

సాళువ నరసింహ రాయలు మరణ శయ్యపై ఉండి విజయనర రాజ్యాన్నీ, తన కుమారులనూ తుళువ నరస నాయకునికి అప్పగించాడు. ఇచ్చిన మాట ప్రకారం ముందు పెద్ద కుమారుడైన తిమ్మ భూపాలుడును తరువాత రెండవ నరసింహ రాయలును సింహాసనం అధిస్టింపచేసి తాను రాజ్యభారాన్ని వహించి అధికారాన్ని చెలాయించాడు.

మొదటి దండయాత్ర

ఇతని అధికారాన్ని సహించలేని సామంతులు స్వతంత్రించారు, గజపతులు విజృంభించి చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. చోళ, పాండ్య, మధుర సామంతులు స్వతంత్రించారు. వీటన్నింటినీ చక్కబరచడానికి 1496లో దండయాత్రకు బయలుదేరినాడు. తూర్పు సముద్రంవరకూగల భూమిని అందున్న సామంతులను అణచి, దక్షిణమునకు వచ్చి చోళ రాజును ముట్టడించాడు. అప్పటి తిరుచినాపల్లి పాలకుడు కోనేటి రాజు ఓడిపోయినాడు, తరువాత మధుర పాలకుడైన మానభూషనుడిని ఓడించి తరువాత పాండ్య రాజ్యముపై దండెత్తి ఆ రాజ్యమును సామంత రాజ్యముగా చేసుకున్నాడు. తరువాత కర్నాటక ప్రాంతమునందున్న ఉమ్మత్తూరు పై దండెత్తినాడు.

ఇలాగే విజయోత్సాహంతో ముందుకు వెళ్తున్న నరస నాయకునికి శ్రీరంగపట్టణం, శివసముద్రంలను ముట్టడించకుండా పొంగిపొరలుతున్న కావేరీ నది అడ్డు వచ్చింది. దానితో కావేరీ నదికి ఆనకట్ట కట్టి శ్రీరంగమును ముట్టడించి భీకర యుద్ధం చేసాడు, దుర్గరక్షణాధికారి హోయ్సణేంద్రుడు బంధీ అయినాడు. శ్రీరంగము నరసనాయకుని వశం అయినది. ఉమ్మత్తూరు కూడా ఇతని ఆధీనంలోనిని వచ్చింది.

బీజాపూరు పాలకునితో యుద్ధం 

బీజాపూరు పాలకుడైన యూసఫ్ ఆదిల్‌షా విజయనగర రాజ్యానికి చెందిన మానువ కోటను ఆక్రమించాడు, దానితో నరసనాయకుడు వారిపైకి సైన్యాలను నడిపి యూసఫ్ ఆదిల్‌షాను బంధీగా పట్టుకోని దయతో వదిలివేసినాడు.

గజపతుల దండయాత్రను అడ్డుకొనుట

1496న గజపతుల రాజు పురుషోత్తమ గజపతి మరణించాడు, అతని కుమారుడు ప్రతాపరుద్ర గజపతి సింహాసనం అధిస్టించి, దక్షిణ దేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరినాడు, కృష్ణా నది దాటి రాకుండా నరస నాయకుడు వీనిని ఓడించాడు. ఇతను 1503లో మరణించాడు.


వీరనరసింహ రాయలు (1503-1509)

వీరనరసింహరాయలు విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తితుళువ వంశ స్థాపకుడైన తుళువ నరస నాయకుని కుమారుడు. ఈయన అసలు పేరు కూడా తండ్రిలాగా నరస నాయకుడే, అయితే సింహాసనాన్ని మాత్రం వీర నరసింహ రాయలు అనే వీరోచిత పేరుతో అధిష్టించాడు. ఇతని తండ్రి నరస నాయకుడు 1503లో దివంగతుడైన తర్వాత వీరనరసింహరాయలు పెనుగొండ లో బందీగా ఉన్న సాళువ ఇమ్మడి నరసింహ రాయలు పేరుతో 1505 వరకు రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ 1506లో అతనిని హత్యగావించి తనే రాజుగా సింహాసనాన్ని అధిష్టించాడు.

సామంతుల తిరుగుబాట్లు

వీరనరసింహరాయలు సాళువ వంశాన్ని అంతమొందించి తనే రాజుగా మారడాన్ని సహించని సామంతులు తిరుగుబాట్లు చేసారు, ముఖ్యంగా ఆదోని పాలకుడు కాసెప్ప ఒడయరు, ఉమ్మత్తూరు పాలకుడు దేవరాజు, శ్రీరంగపట్నం పాలకుడు గుండరాజులు తిరుగుబాటు చేసారు.
బహుమనీ సుల్తాను మహమ్మద్ షా ఆదేశానుసారం అతని సామంతుడు యాసుఫ్ ఆదిల్ఖాన్ 1502లో విజయనగర రాజ్యంపైకి దండయాత్రకు బయలుదేరినాడు. అప్పటికే తిరుగుబాటు చేస్తున్న ఆదోని కాసెప్ప ఒడయారు అతనికి వంతగా తనూ సైనికులను నడిపించాడు, కానీ అరవీటి రామరాజు కుమారుడు అరవీటి తిమ్మరాజు కందనవోలు (కర్నూలు) ప్రాంతాన్ని పరిపాలిస్తూ విజయనగరాధీశులకు సామంతునిగా ఉండెను. అతను ఈ యూసుఫ్ ఆదిల్ఖాన్, కాసెప్ప ఒడయారు సైనికులను మూడు సంవత్సరాలు జరిగిన యుద్ధమందు ఓడించి తరిమేశాడు. ఈ విజయానికి ఆనందించి వీర నరసింహరాయలు అదవాని (అదోని) సీమను అరవీటి తిమ్మరాజునకు విజయానికి కానుకగా ఇచ్చాడు. ఈ సంఘటన వల్ల అరవీటి వంశస్తులూ, తుళువ వంశస్తులూ చక్కని స్నేహితులు అయినారు.
వీరనరసింహరాయలు  మిగిలిన తిరుగుబాటు చేస్తున్న సామంతులను అణచివేయడానికి, తన సోదరుడైన శ్రీ కృష్ణదేవరాయలును రాజ్యపాలనకు నియమించి, 1508 నాటికి ఉమ్మత్తూరు, శ్రీరంగపట్టణములను ఓడించి విజయనగరము వచ్చాడు, కానీ మరల సామంతులు తోక జాడించారు. దానితో ఈ సారి తన సోదరులగు అచ్యుత రాయలు, శ్రీరంగ రాయలును సైన్యసమేతంగా సామంతులను అణుచుటకు పంపించెను, ఈ దండయాత్రలో కొంకణ ప్రాంతపాలకుడు కప్పము చెల్లించడానికి అంగీకరించాడు. మిగిలినవారు ఎదిరించి ఓడిపొయినారు.
ఉమ్మత్తూరుపై యుద్ధంలో పోర్చుగీసు వారు గుఱ్ఱాలు, ఫిరంగులు సరఫరాచేసి రాయలకు సహాయం చేశారు. ప్రతిగా వీరు భట్కళ్ రేవుపై ఆధీనాన్ని పొందారు.

దక్షిణ దండయాత్ర

తరువాత వీర నరసింహరాయలు మరొక దండయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసాడు.
ఈ దండయాత్రలన్నీ ముగిసిన తరువాత వీరు ఆధ్యాత్మిక మార్గంలో పడి కంచి, కుంభకోణము, పక్షితీర్థము, శ్రీరంగము, చిదంబరము, శ్రీకాళహస్తి, గోకర్ణము, రామేశ్వరము, త్రిపురాంతకము, అహోబలము, శ్రీశైలము, తిరుపతి, సంగమేశ్వరము మొదలగు పుణ్యక్షేత్రములను దర్శించి అనేక దాన ధర్మాలను చేసాడు.

వారసుడు

దక్షిణ దేశ యాత్రలు తరువాత వీర నరసింగ రాయలు జబ్బు పడినాడు. దానితో తన వద్ద మహామంత్రిగా ఉన్న సాళువ తిమ్మరుసును పిలిపించి, తన తరువాత, తన ఎనిమి సంవత్సరాల కొడుకు తిరుమల రాయలును రాజ్యానికి వారసునిగా చేయమనీ, అలాగే శ్రీ కృష్ణదేవ రాయలు కను గుడ్లు పీకి చూపించమనీ ఆజ్ఞాపించాడు. కానీ తిమ్మరుసు ముందుగానే అనేక యుద్ధములందు శ్రీ కృష్ణదేవరాయల ప్రతాప సామర్ధ్యములు ఎరిగి ఉన్నందువల్ల ఆ పని చేయలేక విషయమంతా కృష్ణదేవ రాయలుకు చెప్పి అతనిని ప్రవాసం పంపించి, ఓ మేక కనుగుడ్లు తెచ్చి చూపించి రాజును అవసాన కాలంలో సంతృప్తి పరచాడని ఒక కథనం ఉంది. కానీ అన్నదమ్ముల మధ్య సౌభ్రాతృత్వం తప్ప వైరమున్నట్టు ఎలాంటి చారిత్రకాధారాలు లేవు. వీర నరసింహరాయలు 1509లో మరణించాడు. ఆ తరువాత కృష్ణదేవరాయల పట్టాభిషేకం ఎలాంటి గొడవలు లేకుండా సునాయాసంగా జరిగిపోయింది.


శ్రీ కృష్ణదేవ రాయలు    (1509-1529)

శ్రీ కృష్ణదేవ రాయలు (క్రీ.శ.1509-1529) అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన"ఆంధ్ర భోజుడు" మరియు"కన్నడ రాజ్య రమారమణ"గా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.రాయలు, తుళువ నరస నాయకుని రెండవ భార్య అయిన నాగలాంబ (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 41509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలు నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించాడు. రాయలు తల్లి నాగలాంబ గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు ఆడపడచు. 240 కోట్ల వార్షికాదాయము ఉండేది. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్థిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించాడు.

సాహిత్య పోషణ

కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణముమదాలసాచరితముసత్యవధూపరిణయముసకలకథాసారసంగ్రహముజ్ఞానచింతామణిరసమంజరి తదితర గ్రంథములు, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.  తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు రేడ నేను తెలుగొకొండ ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలో అల్లసాని పెద్దననంది తిమ్మనధూర్జటిమాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడుపింగళి సూరనరామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి పొందారు.

దైవభక్తి

కృష్ణదేవ రాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవుడు. కానీ పరమతసహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించాడు. అంతేకాక ధూర్జటినంది తిమ్మన వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు. అనేక దాన ధర్మాలు చేసాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి, అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు. ఈయన చెన్నకేశవస్వామి వారి దేవాలయం కట్టించాడు.

కుటుంబం

కృష్ణదేవ రాయలుకు తిరుమల దేవిచిన్నాదేవి ఇద్దరు భార్యలని లోక విదితము. కానీ, ఆముక్తమాల్యద ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ మరియు కమల). కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు. పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనిజ్ వ్రాశాడు. ప్రతాపరుద్ర గజపతిని ఓడించి, ఆయన కూతురైన తుక్కా దేవిని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రకాధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా వ్యవహరించారు.  చాగంటి శేషయ్య, కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించాడు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు.  కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమలాదేవి పట్టపురాణి అయిఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం.  ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామ రాయలకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524లో మరణించాడు. ఈ విషయంపై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసును అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు, అచ్యుత రాయలును వారసునిగా చేసాడు.

మతము-కులము

శ్రీ కృష్ణ దేవరాయలు మతము దృష్ట్యా విష్ణు భక్తుడు అని అయన వ్రాసిన ఆముక్తమాల్యద తెలుపుచున్నది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అనే విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంట్ అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలుపుచున్నవి. శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22-23-24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తున్నది. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణంలో మరియు శిలాశాసనాలలో లిఖించబడినది.


అచ్యుత దేవ రాయలు    (1529-1542)

అచ్యుత దేవ రాయలు (అచ్యుతరాయలు) విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. తుళువ నరస నాయకుని మూడవ భార్య అయిన ఓబాంబ కుమారుడు. అచ్యుతరాయలు, తుళువ నరసనాయకుని దక్షిణ దండయాత్ర అనంతరం రామేశ్వరం దర్శించివచ్చిన తర్వాత జన్మించాడని "అచ్యుతరాయాభ్యుదయము" మరియు "వరదాంబికా  పరిణయం"లో పేర్కొనబడినది. శ్రీకృష్ణదేవరాయల సవతి సోదరుడు. శ్రీకృష్ణదేవరాయల మరణ శాసనాన్ని అనుసరించి చంద్రగిరి దుర్గములో గృహనిర్బంధములో ఉన్న అచ్యుతదేవరాయలు రాజయినాడు. ఇతడు 1529 నుండి 1542 వరకు పరిపాలించాడు.


శ్రీకృష్ణదేవరాయల మరణంతో విజయనగరములో అంతఃకలహాలు చెలరేగాయి. అచ్యుతరాయల్ని వారసునిగా ప్రకటించడం నచ్చని కృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయలు ప్రతిఘటించి అధికారం కైవసం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ విశ్వాసపాత్రులైన సాళువ నరసింగనాయకుడు వంటి సామంతులు ఆ ప్రయత్నాలు సాగనివ్వలేదు.

పట్టాభిషేకం

ఇతడు మూడుసార్లు పట్టాభిషేకము చేసుకున్నాడు.  అచ్యుతరాయల పట్టాభిషేకాలను రాజనాథ డిండిమభట్టు వ్రాసిన అచ్యుతరాయాభ్యుదయములో వివరముగా వర్ణించాడు.

మొదట తిరుమలలో గర్భగుడిలోపలనే దేవదేవుని శంకుతీర్థముతో పట్టాభిషేకము జరుపుకున్నాడు. ఈ విషయమై విమర్శలు వచ్చాయి. ఎందుకంటే గర్భగుడిలోనికి బ్రాహ్మణులకు తప్ప అన్యులకు ప్రవేశము లేదు.

తరువాత 1529 అక్టోబర్ 21 న (శక స.1452 విరోధి నామసంవత్సర కార్తీక బహుళ పంచమి) శ్రీ కాళహస్తిలో రెండవ పర్యాయము పట్టాభిషేకం జరుపుకున్నాడని కాళహస్తిలోని శాసనము వల్ల తెలుస్తుంది.

తరువాత 1529 నవంబర్ 20 న విజయనగరంలో ముచ్చటగా మూడవసారి పట్టాభిషేకం జరుపుకున్నాడు.

యుద్ధాలు

అచ్యుతరాయలు రాజ్యము చేపట్టేనాటికి వారసత్వ పోరు కారణంగా విజయనగర రాజధానిలోని కల్లోల పరిస్థితులను ఆసరాగా తీసుకొని సామ్రాజ్యంపై ప్రతాపరుద్ర గజపతి దండెత్తినాడు. అయితే రాయలు గజపతిని తిప్పికొట్టాడు. 1530లో గోల్కొండ సుల్తాను కులీ కుత్బుల్ ముల్క్ దండెత్తి కొండవీడును ముట్టడించగా వెలుగోటి గని తిమ్మనాయుడు అతన్ని ఓడించి సుల్తాను అశ్వదళానికి అపార నష్టం కలిగించి దండయాత్రను తిప్పికొట్టాడు. ఇతను అనేక యుద్ధములందు విజయం సాధించాడు.
శత్రు దండయాత్రల ప్రమాదాన్ని గుర్తించిన అచ్యుతరాయలు, రామరాయలుతో సంధి చేసుకున్నాడు. కానీ సాళువ నరసింగనాయకునికి (సెల్లప్ప) అది నచ్చక ఉమ్మత్తూరు మొదలైన దుర్గాధిపతులతో కలిసి తిరుగుబాటు చేశాడు. అయితే అచ్యుతరాయల బావమరుదులైన సలకం పెద తిరుమలరాజు, సలకం చిన తిరుమలరాజులు తిరుగుబాటును అణచివేసి శాంతిని నెలకొల్పారు.
కులీ కుత్బుల్ ముల్క్ తో కోయిలకొండ దగ్గర జరిగిన యుద్ధములో బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్‌షా మరణించగా, అతని కొడుకు మల్లూ ఆదిల్‌షా రాజ్యాన్ని చేపట్టాడు. ఇతని పాలన నచ్చని ప్రజలు అసద్ ఖాన్ లారీ అనే ఉద్యోగి నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. ఇదే అదనుగా 1535లో అచ్యుతరాయలు దండెత్తి రాయచూరు అంతర్వేదిని ఆక్రమించుకున్నాడు.

కుట్రలు

రాజధానిలో రామరాయలు బలం నానాటికి పెరగసాగింది. రామరాయల తమ్ములు వెంకటాద్రి, తిరుమలలు అతడికి అండగా ఉన్నారు. కందనవోలు, అనంతపూరు, ఆలూరు, అవుకు దుర్గాధిపతులు రామరాజు పక్షము వహించారు. ఇంతలో బీజాపూరులో మల్లూ ఆదిల్‌షాను తొలగించి ఇబ్రహీం ఆదిల్‌షా గద్దెనెక్కి, మల్లూ సానుభూతిపరులైన ఉద్యోగులను, మూడు వేల సైన్యాన్ని తొలగించాడు. అలా తొలగించబడిన సైనికులను రామరాయలు తన సైన్యములో చేర్చుకొని రాజధానిలోని తురకవాడలో నిలిపి ఉంచాడు.
1536లో గుత్తి ప్రాంతములోని తిరుగుబాటును అణచి తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకొని రాజధానికి తిరిగివస్తున్న అచ్యుతరాయలను బంధించి, రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించి పట్టాభిషేక ప్రయత్నాలు జరిపాడు. కృష్ణదేవరాయల భార్యలు తిరుమలదేవి, చిన్నాదేవి రామరాయలకు మద్దతు నిచ్చారు. కానీ ప్రజలు, సామంతులు రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించడాన్ని ఇష్టపడలేదు. పట్టాభిషేకానికి అన్నీ సన్నద్ధం చేసుకున్నా, రామరాయల పట్టాభిషేకం జరగలేదు. మధుర, కొచ్చిన్ ప్రాంత సామంతులు కప్పం చెల్లించడం నిలిపివేశారు. రామరాయలు వారిపై దండయాత్రకు బయలుదేరిన సమయములో రాజధానిలోని ఉద్యోగులు సలకం పెద తిరుమలరాజుతో చేరి, అచ్యుతరాయల్ని చెర నుండి విడిపించి సింహాసనముపై పునఃప్రతిష్ఠించారు.
రామరాయలు రాజధానికి మరలేనాటికి ఇబ్రహీం ఆదిల్‌షా నాగలాపురాన్ని నేలమట్టం చేసి రాజధాన్ని సమీపించాడు. ఆదిల్‌షా ప్రతిపక్షంలో చేరతాడన్న భయముతో అచ్యుతరాయలు గానీ, రామరాయలు గానీ అతడిని ప్రతిఘటించలేదు. ఇద్దరూ ఆదిల్‌షా సహాయము అర్ధించి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. అంతలో బీజాపూరులో ఆదిల్‌షాపై అసద్ ఖాన్ లారీ మొదలైన ఉద్యోగులు కుట్రలు ప్రారంభించారు. పరిస్థితిని గమనించిన ఆదిల్ షా అచ్యుత, రామరాయల మధ్య సయోధ్య కుదిర్చి బీజాపూర్ తిరిగి వెళ్ళాడు.

చివరి రోజులు

రామరాయలతో ఒప్పందం అయిన తర్వాత అచ్యుతరాయలు రాజ్య వ్యవహారాలను బావమరిది సలకం పెద తిరుమలరాజు పరం చేసి సర్వదా అంతఃపురములోనే గడిపినట్లు, దానితో ప్రభుత్వం నీరసించినట్లు తెలుస్తున్నది. తుదకు అచ్యుతరాయలు ప్రజాభిమానం కోల్పోయి 1542లో మరణించాడు.

మరణాంతర రాజకీయ పరిస్థితులు

అచ్యుతరాయల మరణంతో రామరాయలు మరియు సలకం తిరుమలల మధ్య స్పర్ధలు తీవ్రమై రాజ్యాన్ని అంతర్యుద్ధంలో ముంచెత్తాయి. అచ్యుతరాయలు కొడుకైన వెంకటపతిని సింహాసనంపై ఎక్కించి, తాను సంరక్షకునిగా అధికారం హస్తగతం చేసుకుని సింహాసనం ఆక్రమించటానికి తిరుమల ప్రయత్నం చేశాడు. దీనికి వ్యతిరేకంగా రామరాయలు గుత్తి దుర్గంలో సదాశివరాయల్ని రాజుగా ప్రకటించాడు. సదాశివరాయలు అచ్యుతరాయల అన్నశ్రీరంగరాయల కుమారుడు. అందుచే అచ్యుతరాయల కంటే విజయనగర సింహాసనంపై సదాశివునకు బలమైన హక్కు ఉందని చాటడం రామరాయల ఉద్దేశం.
తిరుమల, రామరాయల మధ్య సంవత్సరంపాటు జరిగిన అంతర్యుద్ధం అవకాశంగా తీసుకొని ఇబ్రహీం ఆదిల్‌షా రెండుసార్లు విజయనగరంపై దండెత్తాడు. మొదట్లో తిరుమలుని దురాశ నుండి తన కుమారుడు వెంకటపతిని రక్షించే ఉద్దేశముతో వరదాంబిక ఆదిల్‌షాను ఆహ్వానించింది. కానీ తిరుమలుడతనితో ఒప్పందం చేసుకొని వెనుకకు మరలించాడు. తిరిగి రామరాయల అభ్యర్ధనపై ఆదిల్‌షా విజయనగరంపై దండెత్తినాడు. ప్రజలు భయభ్రాంతులై సలకం తిరుమలుని విజయనగర సింహాసనం ఎక్కించారు. తిరుమల దేవ మహారాయలనే పేర పట్టాభిషిక్తుడై ఆదిల్‌షాను ఓడించి పారదోలటమే కాక రాజధానికి తిరిగి వచ్చి మేనల్లుడు వెంకటపతిని హత్యచేసి, తనకు ప్రతికూలురైన రాజోద్యోగులను హింసించాడు. అతని నిరంకుశపాలనకు ప్రజలు విసుగెత్తారు.
పరిస్థితిని గమనించి, రామరాయలు గుత్తి నుండి దండెత్తి వచ్చి తుంగభద్రా తీరములో తిరుమలను ఓడించి, సదాశివరాయలను రాజధానిలో పట్టాభిషిక్తుని చేసాడు.

వ్యక్తిత్వం

న్యూనిజ్ రచనలు అచ్యుతరాయలను వ్యసనలోలునిగా, కౄరునిగా చిత్రీకరించినా, ఈయన ప్రశంసనీయుడని, సామ్రాజ్యపు గౌరవాన్ని, సంపదను నిలబెట్టేందుకు పోరాడాడని చెప్పటానికి ఆ తరువాత కాలములో శాసన మరియు సాహిత్య ఆధారాలు లభించాయి. ఇతడు సమర్ధుడనే కృష్ణదేవరాయలు తన వారసునిగా ఎన్నుకున్నాడు. అచ్యుతరాయల యొక్క జీవితము మరియు పాలనను రెండు సంస్కృత కావ్యాలు, రెండవ రాజనాథ డిండిమ రాసిన అచ్యుతాభ్యుదయం మరియు అచ్యుతరాయల భార్య తిరుమలాంబ రచించిన వరదాంబికా పరిణయం వివరముగా వర్ణిస్తాయి.
అచ్యుత రాయలు విజయనగర సామంతుడైన సలకరాజు కుమార్తె వరదాంబికను వివాహమాడినాడు. వరదాంబికా పరిణయములో అచ్యుతరాయలు పెళ్ళినాటికే చక్రవర్తిగా రాసిన శాసనాధారాలు అచ్యుతరాయలు పట్టాభిషిక్తుడయ్యేనాటికి వరదాంబికతో వివాహమై, కుమారుడు చిన వెంకటపతి కూడా జన్మించియున్నాడని తెలుస్తున్నది. అచ్యుతరాయలతో వియ్యమందిన తరువాత సలకరాజు కుమారులు సలకం తిరుమలుల రాజకీయ ప్రాభవం పెరిగినా పెళ్ళికి ముందునుండే సలకం చిన తిరుమలుడు విజయనగరంలో సేనానిగా పనిచేస్తున్నాడని తెలుస్తున్నది.

కళాపోషణ

ఇతని పరిపాలనా కాలములో హంపిలోని తిరువేంగళనాధుని ఆలయము నిర్మించాడు. ఈ ఆలయం అక్కడ కొలువై ఉన్న దేవుని పేరుమీదుగా కంటే అచ్యుతరాయ ఆలయము అన్న పేరుతోనే ప్రసిద్ధి చెందింది.
ఇప్పుడు కపిల తీర్ధముగా ప్రసిద్ధమైన తిరుపతి లోని ఆళ్వార్ తీర్ధాన్ని అచ్యుతరాయలు నిర్మింపజేశాడు. తీర్ధము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు. 1533లో స్వామివారి పుష్కరిణి మెట్లు బాగుచేయించి పాత పుష్కరిణి పక్కనే కొత్త పుష్కరిణిని కట్టించాడు. తిరుమలలో ఆలయానికి దక్షిణము వైపున అచ్యుతరాయలు మరియు ఆయన భార్య వరదాంబికల రాతి విగ్రహాలు చూడవచ్చు. తమిళనాట దిండిగల్కు సమీపంలో వున్న తాడికొంబు ఆలయాన్ని తిరుమలరాయలు నిర్మింపజేసాడు.
కృష్ణదేవరాయల లాగానే అచ్యుతరాయలు కూడా సాహిత్య పోషకుడు. ప్రతి సంవత్సరం ఒక గ్రంథం రాయించి తిరుపతి వెంకటేశ్వరునికి సమర్పించేవాడు. అచ్యుతరాయలు స్వయంగా తాళమహోదధి అనే గ్రంథం సంస్కృతంలో రాశాడు. ఈయన ఆస్థానములో కన్నడ కవి చాటు విఠలనాధుడు, ప్రముఖ సంగీతకారుడు పురందరదాసు మరియు సంస్కృత విద్వాంసుడు రెండవ రాజనాథ డిండిమభట్టు ఉండేవారు. డిండిమభట్టు అచ్యుతరాయాభ్యుదయముతో పాటు సంస్కృతములో భాగవత చంపు వ్రాసి అచ్యుతరాయలకు అంకితమిచ్చాడు. ఈయన ఆస్థానములోని తెలుగు కవులలో రాధామాధవ కవి ముఖ్యుడు. ఈయన రచించిన తారకబ్రహ్మరాజీయమును అచ్యుతరాయల మంత్రి నంజ తిమ్మనకు అంకితం చేశాడు. కృష్ణరాయల సభ భువనవిజయములాగే, అచ్యుతరాయల సభను వెంకట విలాస మండపము అని పిలిచేవారు.
అచ్యుత రాయల కాలములో స్త్రీలు కూడా చక్కని గ్రంథాలు రాశారు. తిరుమలాంబ వరదాంబిక పరిణయమనే కావ్యము రాసి అందులో అచ్యుత రాయల జీవిత విశేషాలు (చిన వెంకటాద్రిని యువరాజుగా అభిషిక్తుని చేసేవరకు) వివరించింది. ఈ కాలములో ఓడూరి తిరుమలాంబ అనే విదూషీమణి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అచ్యుతరాయలు విఠ్ఠలనాథుని ఆలయానికి బహుకరించిన స్వర్ణ మేరువును పొగుడుతూ ఈమె రాసిన శ్లోకాలుహంపిలోని విఠ్ఠలనాధుని దేవాలయములో ఉన్నాయి. ఈ ఓడూరి తిరుమలాంబ, వరదాంబికా పరిణయము రాసిన తిరుమలాంబ ఒకరేనని కొందరు భావిస్తున్నారు. ఈ కాలములోనే మోహనాంగి అనే మరో రచయిత్రి ఉంది. ఈమె మారిచీపరిణయం వ్రాసింది. ఈమె కృష్ణరాయల కుమార్తె అనీ, అళియ రామరాయల భార్య అనీ కూడా ప్రతీతి.
అచ్యుత రాయలు స్వయంగా మంచి వీణా విద్వాంసుడు కూడా. ఈయన ఉపయోగించిన ప్రత్యేక వీణ అచ్యుతభూపాళీ వీణగా పేరొందినది.


సదాశివ రాయలు (1542-1570)


ఇతను కేవలం నామమాత్ర పరిపాలకుడు మాత్రమే, అధికారము మొత్తం పెదతిరుమలయ్యదేవమహారాయలు చేతిలో ఉండెడిది. కానీ తరువాత అళియ రామ రాయలు కూడా అధికారం కోసం పోటీ పడినాడు. ఈ కాలమున విజయనగరం అంతఃకలహములకు తీవ్రంగా లోనయ్యింది, పరిస్థితులు ఎంతవరకూ వచ్చినాయంటే, పెద తిరుమలయ్యదేవమహారాయలు రాజధానిలోనికి ఆదిల్షాను సైన్యసమేతంగా ఆహ్వానించాడు. అంతకు ముందే పెద తిరుమలయ్య దేవమహారాయలు తన మేనల్లుడూ, రాజ్యానికి వారసుడూ, అచ్యుత రాయలు కుమారుడు అయిన చిన వేంకటపతి రాయలును హత్యాగావించి తనే సింహాసనం అధిష్టించాడు.
ఈ సుల్తాను రాజధానిలోనికి రావడంతో సిగ్గుపడి, భయపడి, అవమానపడిన అళియ రామ రాయలు పెద తిరుమలయ్యను ఒప్పించి సుల్తానుకు ధనం అప్పగించి ఇంటికి పంపించాడు.
తరువాత మాత్రం అళియ దేవ రాయలు తిరుగుబాటు కొనసాగించారు, అయితే పెద తిరుమలయ్య పాపానికి చింతించి, ఆత్మహత్య గావించుకున్నాడు.
తరువాత అచ్యుత దేవ రాయలు సోదరుని కుమారుడగు సదా శివ రాయలు సింహాసనం అధిష్టించాడు, కానీ అధికారం మాత్రం అళియ రామ రాయలు చేతిలోనే ఉండేది. అనంతర కాలంలో సుల్తానుల కూటమితో విజయనగర సామ్రాజ్యం   రాక్షస తంగడి (తళ్ళికోట యుద్ధం)   యుద్ధంలో ఘోర పరాజయం పాలై అళియ రామరాయలు యుద్ధంలో మరణించారు. ఈ యుద్ధానంతరం సుల్తానుల సైన్యం మొత్తంగా రాజధానియైన విజయనగరం నేలమట్టంగా నాశనం చేసింది. దీనితో అళియ రామరాయల తమ్ముడైన తిరుమల దేవరాయలు సదాశివరాయలను, విజయనగర సామ్రాజ్య ఖజానాను తీసుకుని పెనుకొండకు పారిపోయారు.
పెనుకొండలో కూడా ఇతనిని సింహాసనంపై ఉంచి తిరుమల దేవరాయలే పరిపాలించారు. చివరకు 1570లో సదాశివ రాయలను తిరుమల దేవరాయలు సంహరించి తాను అధికారం చేపట్టారని రాబర్ట్ న్యూయల్ భావించారు. కానీ సదాశివ రాయల శాసనాలు 1575 వరకూ కనిపిస్తూండడంతో ఇది వాస్తవం కాదని చరిత్రాకారులు అభిప్రాయపడుతున్నారు.

అరవీటి వంశము

 అరవీటి వంశము విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన నాలుగవ మరియు చివరి వంశము. అరవీటి వంశము తెలుగు వంశము మరియు వీరి వంశమునకు ఆ పేరు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం తాలూకాలోని ఆరవీడు గ్రామము పేరు మీదుగా వచ్చింది. వీరు అధికారికముగా 1571 నుండి సామ్రాజ్యమును పాలించినా, వీరనరసింహ రాయలు కాలమునుంచే సైన్యములో ప్రముఖ పాత్ర పోషించారు.

భారతదేశ చరిత్రలోనే ఒకానొక కీలకమైన, నిర్ణయాత్మకమైనదిగా చరిత్రకారులు భావించేది..... రాక్షసి తంగడి యుద్ధం (తళ్ళికోట యుద్ధం). ఈ యుద్ధంతోనే విజయనగర మహాసామ్రాజ్యం పతనమైపోయింది. విజయనగర సామ్రాజ్యానికి ప్రధాన లక్షణాలైన వ్యవసాయం, వ్యాపారం, విదేశీ వాణిజ్యం, కళలు, సాహిత్యం అన్నీ చారిత్రక అవశేషాలుగా మిగిలిపోయినాయి. ప్రపంచంలో ఏ నగరంలోనూ జరగనంత విధ్వంసం జరిగింది... ఈ అరాచకాలు, అల్లకల్లోలాలు సుమారు అయిదు నెలలపాటు కొనసాగినాయి.. ముస్లిం సుల్తానులంతా ఏకమై ఓడించి విజయనగర సామ్రాజ్యపతనం చూసి సంబరపడ్డారు కానీ. వారు తిరిగి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోవటాన్ని అదనుగా భావించిన మొగల్ రాజ్యపాలకులు దాడి చేసి సులభంగా జయించారు.
అరవీటి వంశము విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన నాలుగవ మరియు చివరి వంశము. అరవీటి వంశము తెలుగు వంశము.

రామరాయల మరణాంతరం పెనుగొండ పారిపోయిన తిరుమల రాయలు పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలించాడు. అతను అరవీటి వంశస్తుడు. కనక అతని పాలనతో అరవీటి వంశ పాలన ప్రారంభమయింది. అరవీటి వంశస్తుల స్వస్థలం కర్నూలు జిల్లా ఆరెవీడు. కనక వారి వంశానికి అరవీటి వంశం అని పేరు వచ్చింది.ఈ వంశానికి మూలపురుషుడు అరవీటి సోమరాజు. విజయనగరపాలకులకు సామంతులు.

సాళువనరసింహరాయల కాలంలో అరవీటి తిమ్మరాజు నరసింహరాయల వద్ద సేనాధిపతిగా పనిచేశారు. తిమ్మరాజుకు రామరాయలు, వెంకటాద్రి రాయలు, తిరుమలరాయలు అని ముగ్గురు కుమారులు.వారిలో రామరాయలు, వెంకటాద్రి రాయలు తళ్ళికోట యుద్ధంలో మరణించారు. వారి మరణం తరువాత తిరుమలరాయలు సదాశివ రాయలను వెంటబెట్టుకుని పెనుగొండకు పారిపోయాడు. అయిదు నెలలపాటు జరిగిన విధ్వంసం తరువాత విజయనగరానికి తిరిగివచ్చి పునర్నిర్మించటానికి ప్రయత్నించారు... కానీ సుల్తానుల దాడుల వల్ల బాగు చేయలేనంతగా ధ్వంసం అయిన విజయనగరాన్ని బాగుచేయలేమని గ్రహించి....విజయనగరాన్ని వారికి ఒదిలేయక తప్పిందికాదు...

అళియ రామ రాయలు (1542-1565)


ఆరవీటి రామరాయలు (జ.1484 - మ.1565)  శ్రీ కృష్ణదేవ రాయల అల్లుడు, గొప్ప వీరుడు, రాజకీయ చతురుడు, 16వ శతాబ్ది రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించాడు. విజయనగర రాజవంశములలో నాలుగవది, చివరిదీ ఐన ఆరవీటి వంశమునకు ఆద్యుడు. శ్రీ కృష్ణదేవరాయల అల్లుడైనందున ఈయనను అళియ రామరాయలు (కన్నడములో అళియ అంటే అల్లుడు) అని కూడా వ్యవహరిస్తారు. ప్రముఖ సంస్కృత పండితుడు రామామాత్యుడు రామరాయల ఆస్థానములో ఉండెడివాడు.

తొలిదశ



రామరాయలు ఆధునిక కర్నూలు జిల్లా ప్రాంతంలో 1484లో జన్మించాడు. రామరాయల తండ్రి శ్రీరంగరాజు విజయనగర రాజ్యంలో ప్రముఖ సేనాధిపతి. సాళువ నరసింహరాయలు సింహాసనానికి వచ్చేటప్పటికి రామరాయలు ఏడాది బాలుడు. 1505లో ఇరవై ఒక్క యేళ్ల వయసు వచ్చేసరికి విజయనగర సామ్రాజ్యం మూడు వంశాల చేతులు మారటంతోపాటు అధికారం కోసం జరిగే కరుడు కట్టిన రాజకీయాలు అనేకం చూశాడు. ఆ తరువాత ఏడేళ్లకే గోల్కండ సుల్తానుల సేవలో చేరాడు.1512లో సుల్తాను విజయనగర సామ్రాజ్యపు ఉత్తర భాగంలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొన్నప్పుడు రాచకొండ కోటకు దుర్గాధిపతిగా ఆ ప్రాంతాన్ని పాలించడానికి రామరాయలను నియమించాడు. అయితే సుల్తానుల సేవలో రామరామలు అట్టేకాలం లేడు. 1515లో బీజాపూరు సుల్తాను రామరాయల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై దండెత్తినపుడు రామరాయలు కోటవిడచి గోల్కొండకు పారిపోయాడు. ఇది పిరికిపనిగా భావించిన గోల్కొండ సుల్తాను ఆయన్ను సేనలో నుండి తీసేశాడు. రాయరాయలు విజయనగరం తిరిగివచ్చి కృష్ణదేవరాయల సేనలో చేరాడు.

పరిపాలన

రామరాయలు శ్రీరంగరాజు, తిరుమలాంబల కొడుకు. శ్రీకృష్ణదేవరాయల పాలనలో గొప్ప సేనాధిపతిగా, పరిపాలకునిగా, రాజకీయ తంత్రము తెలిసిన వాడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. మామ చనిపోయిన తరువాత రాజకార్యములలో తన ప్రభావము చూపాడు. 1529లో శ్రీకృష్ణదేవరాయల చిన్న తమ్ముడు అచ్యుతరాయలు సింహాసనమెక్కి 1542వరకు పాలించి చనిపోయాడు. పిమ్మట అతని మేనల్లుడు, బాలుడగు సదాశివరాయలు రాజయ్యాడు. రాజ్యాధికారమంతయూ రామరాయల చేతిలోనే ఉంది. సదాశివరాయని తొలగించి తానే రాజయ్యే అవకాశముందని కొలువులోని పెక్కుమందికి అనుమానము. కోశాధికారి, మహాయోధుడగు సలకము తిమ్మరాజు రామరాయలని హత్యచేయుటకు ఏర్పాటు చేసాడు. ఇది తెలిసి రామరాయలు గండికోటకు పారిపోయి అచట విజయనగర రాజ్యానికి విశ్వాసపాత్రుడగు పెమ్మసాని యెర్ర తిమ్మానాయుని ఆశ్రయము పొందాడు. తిమ్మరాజు పెద్ద సైన్యముతో గండికోట వచ్చి రామరాయలను అప్పగించమని తిమ్మానాయుని కోరగా, "మమ్ములను ఆశ్రయించిన వారిని రక్షించుట మా ధర్మము. మీతో పోరునకు మేము సిద్ధము" అని తిమ్మానాయుడు సమాధానమిచ్చాడు. గండికోటకు మూడు క్రోసుల దూరాన గల కోమలి వద్ద తిమ్మరాజుకు, యెర్రతిమ్మానాయునికి మధ్య యుద్ధము జరిగింది. ఈ యుద్ధములో విజయనగర సేన ఓడిపోయింది. తిమ్మానాయుడు, రామరాయలు తిమ్మరాజుని విజయనగరము వరకు తరిమి చంపాడు. ఈ యుద్ధ పర్యవసానంగా రామరాయలు విజయనగర సామ్రాజ్యాధిపతి అయ్యాడు

సుల్తానులతో సంబందాలు

ఇతని కాలమున నలుగురు సుల్తానులు దక్కనును పరిపాలించేవారు
బీజాపూరు సుల్తాను ఇబ్రహీం ఆదిల్షా , అహ్మద్‌నగర్‌ సుల్తాను బురహాన్ నిజాం షా , గోల్కొండ సుల్తాను జంషీద్ కులీ కుతుబ్ షా , బీదరు సుల్తాను అలీ బరీదు
వీరిలో వీరు కలహించుకుంటూ ఉండేవారు. వీరు తమ తగవులు తీర్చుటకు తరచూ రామరాయల మధ్యవర్తిత్వము కోరుతుండేవారు. ఇదే అదనుగా రామరాయలు రాజ్యాన్ని కృష్ణా నదికి ఉత్తరముగా వ్యాపింపచేశాడు. తిరువాన్కూరు, చంద్రగిరి పాలకులను అణచివేశాడు.
  • 1543లో అహ్మద్‌నగర్‌, గోల్కొండ సుల్తానులకు సహకరించి బీజాపూరు సుల్తాను నుండి రాయచూరు అంతర్వేదిని సాధించాడు.
  • 1549లో అహ్మద్‌నగర్‌ సుల్తాన్ కు సహకరించి బిజాపూర్, బీదర్ సుల్తానుల నుండి కళ్యాణి కోటను సాధించి పెట్టాడు.
  • 1557లో బిజాపూర్, బీదర్ సుల్తానుల వైపు న ఉండి అహ్మద్ నగర్, గోలకొండ సుల్తానులతో తలపడ్డాడు.
  • గోల్కొండ నవాబు అయిన జంషీద్ కులీ కుతుబ్ షా చివరి తమ్ముడు అయిన ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి ఏడు సంవత్సరములు ఆశ్రయమిచ్చి తరువాత జాగీరు కూడా ఇచ్చాడు.
  • 1551లో రామరాయలూ, అహ్మద్‌నగర్‌ సుల్తానూ బీజాపూరు పైకి దండయాత్ర చేసి రాయచూరు, ముద్గల్లు, కృష్ణా, తుంగ భద్రా నదుల మధ్య భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
  • 1553లో ఏడు లక్షల ధనమును స్వీకరించి బీజాపూరు సుల్తానును అహ్మద్‌నగర్‌ సుల్తాను అయిన హుసేన్ నిజాం షా నుండి కాపాడినాడు.
  • రామరాయలు తన సైన్యములో పలు ముస్లిమ్ సైనికులను చేర్చుకున్నాడు. వారిలో ముఖ్యులు జిలానీ సోదరులు. వీరే తళ్ళికోట యుద్ధములో రామరాయలకు ద్రోహము చేసి, సుల్తానులకు సహకరించి, యుద్ధ పరిణామములో నిర్ణయాత్మక పాత్ర వహించారు.

తళ్ళికోట యుద్ధము

సుల్తానుల మధ్య వైవాహిక సంబంధాలు ఏర్పడినాయి. వారి మధ్య తగవులు తగ్గాయి. 1564 డిసెంబర్ 25 న నలుగురు సుల్తానులూ ఏకమై తళ్ళికోట వద్ద విజయనగరంతో యుద్ధానికి సిద్దమయ్యారు. 1565 జనవరి 23 న జరిగిన తళ్ళికోట యుద్ధములో రామరాయలు శత్రువుల చేతిలో మరణించాడు. దీనితో శతాబ్దాల విజయనగర వైభవం క్షీణించింది. కేవలం యుద్ధ శిబిరాలనుండే కోటింపాతిక ధనమును పొందినారు. విజయనగరము సర్వనాశనము చేయబడింది. నగర విధ్వంసమునకు ఐదు నెలలు పట్టింది. ఆరునెలలు నలుగురు సుల్తానులు విజయనగరంలోనే మకాం వేసి, తరువాత వారిలో వారికి గొడవలు వచ్చి ఎవరి రాజ్యానికి వారు తరలివెళ్ళారు. యుద్ధానంతరము రామరాయలు తమ్ముడు తిరుమలరాయలు సదాశివరాయలతో బాటు ధనసంపత్తిని తీసుకొని పెనుగొండకు తరలిపోయాడు. చాల సంవత్సరాలు అచటి నుండి రాజ్యాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు చేసాడు.   రాజ్యానికి గౌరవప్రపత్తులు సంపాదించిన కారణంగా రామరాయలు, అతని వారసులు చారిత్రికులచే అరవీటి వంశస్థులుగా పరిగణింపబడ్డారు

తిరుమల దేవ రాయలు    (1565-1572)


తిరుమల దేవరాయలు, ఆరవీటి వంశ స్థాపకుడైన  రామరాయల తమ్ముడు, శ్రీ కృష్ణదేవరాయల చిన్న అల్లుడు. తళ్లికోట యుద్ధములో రాయరాయలతో పాటు పోరాడాడు. ఆ యుద్ధములోనే ఒక కన్ను కోల్పోయాడు. ఈయన 1570 నుండి 1572 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పెనుగొండ రాజధానిగా పరిపాలించాడు. యుద్ధానికి పూర్వము కూడా ఈయన పెనుగొండను పాలించినట్లు ఫెరిస్తా రచనల వల్ల తెలుస్తున్నది.
యుద్ధము నుండి ప్రాణాలతో బయటపడి నామమాత్ర పాలకుడైన సదాశివరాయలతో సహా 1550 ఏనుగులమీద విజయనగర ఖజానానంత ఎత్తుకొని పెనుగొండకు వచ్చాడు. సుల్తానులు నలుగురూ విజయనగరాన్ని వదిలిన తరువాత ఇతను రాజధాని చేరుకోని బాగుచేయ ప్రయత్నించాడు. కానీ తరువాత మూడు సంవత్సరాలకు ఆ శ్మశానంలో ఉండలేక రాజధానిని పెనుగొండకు మార్చాడు.
అళియ రామరాయల కొడుకైన పెదతిరుమలుడు పినతండ్రి అధికారాన్ని నిరసించి అతన్ని అధికారము నుండి తొలగించి పెనుగొండను సాధించడానికి అలీ ఆదిల్‌షా సహాయం అర్ధించాడు. పెదతిరుమలుని కోరికపై ఆదిల్‌షా పెనుగొండ మీదికి ఖిజర్ ఖాన్ నాయకత్వంలో సైన్యాన్ని పంపాడు. పెనుగొండ దుర్గపాలకుడైన సవరం చెన్నప్ప ఈ దాడిని తిప్పికొట్టినాడు.

తళ్లికోట యుద్ధం తర్వాత పంచపాదూషాలలో ఐకమత్యం లోపించి యధాప్రకారముగా కలహించుకోసాగినారు. స్వీయరాజ్యరక్షణకు వారి వ్యవహారాలలో కలజేసుకోవటము అవసరమని తిరుమలరాయలు భావించాడు. కుతుబ్‌షా, నైజాంషాలు కలసి ఆదిల్‌షాపై చేసిన యుధ్హములో తిరుమలరాయలు మిత్రకూటమితో చేరినాడు. అందుకు ఆగ్రహించి అలీ ఆదిల్‌షా 1568లో ఆదోని, పెనుగొండలపై దాడిచేసాడు. పెనుగొండపై దాడి విఫలమైనది కానీ ఆదోని పాలకుడైన కోనేటి కొండమరాజు ఓడిపోయి బీజాపూరు సామంతుడైనాడు. ఆదోని రాజ్యము శాశ్వతంగా బీజాపూరు రాజ్యములో చేరింది.
తిరుమల రాయలు, 1570 లో సదాశివరాయలను హతమార్చి అధికారము చేజిక్కించుకొన్నాడని రాబర్ట్ సూయల్ అభిప్రాయపడ్డాడు. అయితే 1576 వరకు సదాశివరాయల యొక్క పేరు శాసనాలలో ప్రస్తావించడము వల్ల అప్ప్టిదాక ఆయన జీవించే ఉన్నాడని మరొక వర్గపు వాదన.
తిరుమల రాయలు రాజ్యానికి వచ్చేసరికి వృద్ధాప్యము వల్ల ఎంతో కాలము పరిపాలించలేకపోయాడు. ఇతనికి ముగ్గురు కుమారులు, ఒక్కొక్కరినీ ఒక్కొక్క ప్రాంతానికి ప్రతినిధులుగా చేసెను. రామరాయలును  శ్రీరంగపట్టణం రాజధానిగా కన్నడ ప్రాంతాలను, శ్రీరంగ రాయలు పెనుగొండ రాజధానిగా తెలుగు ప్రాంతాలను, మూడవ కొడుకు వెంకటాద్రి చంద్రగిరి రాజధానిగా తమిళ ప్రాంతాలను పాలించారు. రాకుమారుల మధ్య పరస్పర సహకారం లోపించడముతో రాజ్యం బలహీనమై సుల్తానుల విస్తరణకు అవకాశం కల్పించింది. ఇతను సామ్రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించి ఆ ప్రాంతాలకు తన కుమారులను ప్రతినిధులుగా ఉంచాడు. తిరుపతి, కంచి, శ్రీరంగంలలో ఉన్న దేవాలయాలకు మరమ్మత్తులు చేయించాడు.
తిరుమలరాయలు శ్రీకృష్ణదేవరాయల రెండవ భార్య చిన్నాదేవి కుమార్తె అయిన వెంగళాంబను వివాహము చేసుకొన్నాడు. ఈయనకు నలుగురు కుమారులు : రఘునాథ రాయలు, శ్రీరంగ రాయలు, రామరాయలు, వెంకటరాయలు. రఘునాథ రాయలు. నిజాంషాను ఓడించి సుల్తాను సేనలను కృష్ణానది ఆవలికి పారద్రోలాడు. అయితే తిరుమలరాయలు రాజ్యానికి వచ్చేనాటికి ఈయన జీవించి ఉండకపోవచ్చని చరిత్రకారుల అభిప్రాయం.
కళాపోషణ
 తిరుమలరాయలు గొప్ప  పాలకునిగానే కాక సాహితీవేత్తగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇతను స్వయంగా కవి... జయదేవుని గీతగోవిందానికి వ్యాఖ్యానం వ్రాశాడు. . ఈయన పైనే అన్నాతిగూడ హరుడవే అన్న చాటు పద్యాన్ని రామరాజభూషణుడు చెప్పాడని ప్రతీతి. రామరాజభూషణుడు రాసిన వసుచరిత్రను తిరుమలరాయలకు అంకితమిచ్చాడు. ఈయన సభలోఉన్న లక్ష్మీధరుడనే కవి సంగీతము పై భరతశాస్త్ర గ్రంథము రచించాడు.
తిరుమలలోని గర్భగుడి ప్రాంగణములో రంగమండపము పక్కన కల సాళువ నరసింహరాయలు కట్టించిన ఉంజల్ మండపం లేదా సాళువ మండపం శిథిలావస్థకు చేరటముతో తిరుమలరాయలు దానిని విస్తరించి పునరుద్ధరించాడు. అప్పటినుండి దానికి తిరుమలరాయ మండపము అని పేరు వచ్చింది. ఇక్కడ ఈయన విగ్రహము కూడా ఉంది. సాళువ నరసింహరాయలు 1468లో ప్రారంభించిన వసంత తిరునాలను తిరుమలరాయలు మరింత వైభవోపేతమైన పండుగగా తీర్చిదిద్దాడు.

శ్రీరంగ దేవ రాయలు    (1572-1586)


శ్రీరంగ రాయలు అరవీటి వంశానికి చెందిన విజయనగర చక్రవర్తి. ఇతని పాలనా కాలం 1572 - 1586. ఇతడు తిరుమల దేవ రాయలు రెండవ కుమారుడు. ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. కొన్ని చోట్ల విజయం సాధించినా కొంత భూభాగం నష్టపోయాడు.

. ఇరుగుపొరుగు సుల్తానుల నుంచి అనేక దాడులను ఎదుర్కొన్నాడు. తొలుత అహోబిలాన్ని పోగొట్టుకున్నప్పటికీ తిరిగీ స్వాధీనం చేసుకున్నాడు. ఇతనికి సంతానం లేకపోవడం వల్ల చంద్రగిరి రాజప్రతినిధిగా ఉన్న ఇతని తమ్ముడు రెండో వెంకటరాయలు సింహాసనం అధిష్టించాడు.
ఇతను గోల్కొండ నవాబు అయిన ఇబ్రహీం కుతుబ్ షాతో మంచి స్నేహం చేసాడు. 1576లో అలీ ఆదిల్షా పెనుగొండపైకి దండయాత్రకు వచ్చి కొంత రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు, అంతే కాకుండా రాజును బంధీ చేసుకోని వెళ్ళినాడు. తరువాత సామంతులు కూడా స్వతంత్రులు అవ్వ ప్రయత్నించారు. 1577లో రాజు చెర నుండి బయటకి వచ్చి, మరలా సామంతులందరినుండి కప్పాలు వసూలు చేశాడు. సైన్యాన్ని వృద్ది పరచాడు.
1578లో బీజాపూరు సేనలు మరలా యుద్ధానికి పెనుగొండపైకి వచ్చినాయి. కానీ అపజయంతో తీరని నష్టంతో వెనుతిరిగినాయి. ఈ యుద్ధంలో పెనుగొండ సేనాని జగదేవరాయడు చక్కని వ్యూహంతో ఘోరమైన యుద్ధం చేశాడు. 1578లోనే ఇబ్రహీం కుతుబ్ షా ఆక్రమించిన అహోబిళం ప్రాంతాన్ని శఠగోపస్వామి అర్దింపుపై రాజు సోదరులు సైన్య సమేతంగా వెళ్ళి విముక్తం చేశాడు.
1579లో గోల్కొండ సుల్తానులతో యుద్ధమున చాలా వరకూ భూభాగాన్ని కోల్పోయినారు.
శ్రీరంగదేవరాయలు 1586లో మరణించాడు. అతనికి వారసులు లేనందున చిన్నతమ్ముడు వేంకటపతి దేవ రాయలు రాజయ్యాడు.

రెండవ  వెంకటపతి రాయలు  (1586-1614)

క్రీ.శ.1585 నుంచి 1614 వరకు కొంతకాలం పాటుగా పెనుగొండను, తర్వాత చంద్రగిరిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన చక్రవర్తి వేంకటపతి దేవరాయలు. ఆయన విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియ రామరాయలు (అరవీటి రామరాజు) తమ్ముని కుమారుడు. ఆయన కాలంలోనే ఈస్టిండియా కంపెనీ వారు వర్తకం కోసం చెన్నపట్టణం ప్రాంతాల్లోకి ప్రవేశించారు. పులికాట్ వద్ద వర్తకసంఘాన్ని ఏర్పరుచుకున్న పోర్చుగీస్ వారు ఇతరదేశాల నుంచి దేశంలోకి దిగుమతి చేసే సరుకులపై నూటికి పావలా చొప్పున చక్రవర్తికి సుంకం చెల్లించేవారు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన గొప్ప, శక్తివంతులైన రాజుల్లో ఇతనే చివరివాడు. ఇతను కూడా దక్కన్ ముస్లిం ల దాడికి లోనయ్యాడు. వెంకటరాయలు తన సామంతులనూ, నాయకులనూ ఒకతాటిపైకి తెచ్చి గుత్తిని ఆక్రమించుకున్నాడు. రుస్తుమ్ ఖాన్ నాయకత్వంలో వచ్చిన గోల్కొండ మొత్తం సైన్యాన్ని ఓడించి, గండికోటను ఆక్రమించుకున్నాడు. ఉదయగిరితో పాటు, కృష్ణానది వరకూ ఉన్న ప్రాంతాలు వెంకటరాయల అధికారంలోకి వచ్చినాయి. రాజ్యంలోని తిరుగుబాట్లను కూడా అణచివేశాడు. మొగల్ చక్రవర్తి అక్బర్ సార్వభౌమాధికారాన్ని అంగీకరించమని రాయబారిని పంపినా ధైర్యంగా తిరస్కరించాడు. ఇతను చంద్రగిరిని రాజధానిగా చేసుకున్నాడు. ఇతను కవి పండిత పోషకుడు. ఇతని ఆస్థానంలో వేదపండితుడైన అప్పయ్యదీక్షితులు, చెన్న బసవపురాణం వ్రాసిన విరూపాక్ష పండితుడు, జైన వ్యాకరణాన్ని రచించిన బట్టలంకదేవుడు మొదలైన ప్రసిద్ధకవులు ఉండేవారు. వారేకాక భోజరాజీయాన్ని రచించిన అనంతామాత్యుడు ఉండేవారు. ఇతనికి కుమారులు లేకపోవడంవల్ల రెందో శ్రీరంగరాయలను తన వారసుడుగా నియమించాడు. రెందో శ్రీరంగరాయల (1616) తరువాత రామదేవరాయలు (1616-1630), మూడవ వెంకటపతి రాయలు (1630-1642) లు పాలించారు. వీరి తరువాత మూడో శ్రీరంగరాయలు పాలించాడు. ఆయన పరిపాలన కాలంలోనే బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ వారు వర్తక సంఘంగా దక్షిణ భారతదేశంలోకి, మరీ ముఖ్యంగా తమిళ, ఆంధ్రదేశాల్లోకి చేరప్రారంభించారు. ఈస్టిండియా కంపెనీ వారు చెన్నపట్టణంలో కోటకట్టుకునేందుకు, చంద్రగిరిలో చర్చిలు నిర్మించుకునేందుకు అనుమతులు ఇచ్చారు.


రెండవ  శ్రీరంగ దేవ రాయలు  (1614-1614)

మొదటి శ్రీరంగరాయలు 1614లో విజయనగర చక్రవర్తిగా కొద్దిరోజుల అతితక్కువ కాలం పరిపాలన చేసిన చక్రవర్తి. రాచకుటుంబంలోని అంతర్గత కుమ్ములాటల కారణంగా ఆయన కొద్దిరోజుల్లోనే జగ్గరాజు అనే రాజబంధువు వల్ల ఖైదులో పడ్డారు.

నేపథ్యం

1585 నుంచి 1614 వరకూ విజయనగర సామ్రాజ్యాన్ని పెనుకొండచంద్రగిరి కోటల నుంచి పరిపాలించిన చక్రవర్తి ఆరవీటి వేంకటపతిదేవరాయలు. ఆయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన అళియ రామరాయల తమ్ముని కుమారుడు. వేంకటపతి దేవరాయలకు నలుగురు భార్యలు ఉండేవారు. కొన్ని ఆధారాల ప్రకారం ఆయన భార్యల సంఖ్య ఐదు. వేంకటపతి దేవరాయ మహారాయలకు ఇందరు భార్యలున్నా పుత్రసంతానం మాత్రం ఏ భార్య వల్ల కూడా కలుగలేదు. వేంకటపతి దేవరాయల పెద్ద భార్య వెంకటాంబ తన పుట్టింటి వారితో ఒక తంత్రం నడిపారు. వెంకమాంబ పుట్టింటి ప్రాంతానికి చెందిన ఓ బ్రాహ్మణస్త్రీ గర్భవతిగా ఉండగా భర్త చనిపోవడంతో తనకున్న స్థితిలో తనకు పుట్టబోయే బిడ్డను ఎవరికైనా ఇవ్వాలని ఆశించింది. ఆ విషయాలు తెలుసుకున్న ప్రాంతపాలకులైన వెంకటాంబ తండ్రి తన కూతురికి నెలతప్పిందని ప్రకటించి ఆమెకు మగబిడ్డ పుడితే వానిని ఆమె కుమారునిగా ప్రకటింపజేసే పన్నుగడ పన్నారు. అలా ఆమె తాను గర్బం ధరించినట్టు వేషంవేసింది. చివరకు బ్రాహ్మణ స్త్రీకి మగపిల్లాడు పుట్టడంతో వానిని తీసుకువచ్చి ఆమె పక్కలోవేసి అతను చక్రవర్తి కుమారుడన్నట్టు భ్రమింపజేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం రాయలవారి వరకూ వచ్చింది. అయితే ఈ విషయంపై ఏం చేసినా తనకూ, రాణికీ కూడా అపకీర్తి కలుగుతుందని భావించి ఏమీ ఎరగనివానిలా ఉన్నారు. పుత్రోత్సవం జరిపి నామకరణం చేసి ‘’చిక్కరాయలు’’ అని ఆ పిల్లానికి పేరు పెట్టారు. రాకుమారునికి జరిపే ముద్దుముచ్చటల్లో లోపం ఏమీ చేయకున్నా అతనిపై పుత్రునిపై చూపే ప్రేమ చూపేవారుకాదు. అదుపాజ్ఞల్లో పెంచారు. పద్నాలుగేళ్ళ వయసులో రాయలవారు తమ బావమరిది కుమార్తెనిచ్చి చిక్కరాయలకు పెళ్ళిచేశారు. ఎంతచేసినా యువరాజుకు ఇచ్చే మర్యాదలు మాత్రం చిక్కరాయలకు దక్కించలేదు.

రాజ్యాధికారం

వెంకటపతి దేవరాయల కుమారుడు బ్రాహ్మణ పుత్రుడని నమ్మిక రూఢిగా వ్యాపించివుండడంతో ఆయన తర్వత రాజ్యానికి ఎవరు వస్తారనే విషయంపై క్రీ.శ.1600 నాటికే ఆలోచన ఉంది. రాయలవారి అన్నయ్య, శ్రీరంగపట్నానికి రాజప్రతినిధిగా ఉన్నవారు అయిన రామరాయలకి చామరాజు, రంగరాయలు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడైన రంగరాయలపై ఆయన ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. ఈ రంగరాయలే చక్రవర్తి అవుతాడన్న అభిప్రాయం వ్యాపించేవుంది. చివరకు రాజుకు అవసానకాలం ఆసన్నమైనప్పుడు 1614లో మంత్రులు, సామంతులు మొదలైన ముఖ్యరాజపురుషుల సమక్షంలో తన కొడుకుగా చెప్పబడే చిక్కరాయలను కాదని అన్న చిన్నకొడుకు శ్రీరంగరాయలను తన రాజ్యానికి రాజుని చేయవలసిందని ఉంగరాన్నిచ్చి వారసుణ్ణి చేశారు. ఐతే అప్పుడు శ్రీరంగరాయలు ఏడుస్తూ ముందు రాజ్యం వద్దన్నాడని, అక్కడున్న రాజపురుషులు చెప్పినమీదట రాజ్యాన్ని తీసుకున్నాడని ప్రత్యక్షంగా చూసిన బర్రడస్ అనే చరిత్రకారుడు వర్ణించారు. శ్రీరంగరాయలు 1614లో వెంకటపతి దేవరాయలు మరణానంతరం సింహాసనాన్ని అధిష్ఠించారు.

కుట్ర , పదవీ వియోగం


రాణీ వెంకటాంబ సోదరుడైన గొబ్బూరి జగ్గరాజు తన మేనల్లునిగా చెలామణి అయ్యేవానికి రాజ్యందక్కితే తాను అధికారం చేయవచ్చన్న ఊహలు కల్లలు కాగా కొందరు సర్దార్ల సహకారాన్ని స్వీకరించి తాను శ్రీరంగరాయలను ఖైదుచేయించారు. ఆపైన తన మేనల్లుడిని రాజ్యంలో నిలిపారు. బలవంతుడైన జగ్గరాజుని ఎదిరించలేక జగ్గరాజు పక్షానే చాలామంది సామంతులు, సర్దార్లు చేరారు. వెంకటగిరి జమీందార్ల పూర్వీకుడు యాచమనాయుడు మాత్రం వెంకటపతి దేవరాయల ఇష్టానికి విరుద్ధమైన ఈ పనిని అంగీకరించలేక జగ్గరాజును వ్యతిరేకించి నిలిచారు.


ఖైదులో ఉన్న రాజకుటుంబాన్ని విడిపించే ప్రయత్నం చేయగా సాధ్యమైనంతలో శ్రీరంగరాయలు తన పన్నెండేళ్ళ కొడుకును మాత్రం పంపగలిగారు. చాకలివాడి మురికిగుడ్డల మూటలో బయటకు తీసుకువచ్చిన రామదేవరాయలను యాచమనాయుడి వద్దకు చేర్చారు. ఈ విషయం తెలియగానే చాలామంది సర్దార్లు యాచమనాయుని పక్షాన చేరారు. సర్దార్లను భయపెట్టి, లంచాలిచ్చి తన పక్షాన నిలుపుకుంటూ చెరసాలలోని రాచకుటుంబానికి బందోబస్తు జగ్గరాజు బాగా పెంచారు.

మరణం

యాచమనాయుడు రాచకుటుంబాన్ని చెరవిడిపించేందుకు విశ్వప్రయత్నాలు చేసి తుదకు చెరసాల నుంచి బయటకు తన నమ్మకస్తుడైన బంటుతో ఓ సొరంగం తవ్విస్తూపోయాడు. దాని గుండా రాయలవారిని బయటకు రప్పించాలని ప్రయత్నించేలోగానే పహరాకాసే బంటు ఆ సొరంగంపైన అడుగువేసి బోలుగా ఉన్న నేలలోకి దిగబడిపోగా రహస్యం బయటపడింది. ఈ విషయానికి కోపించిన జగ్గరాజు రాచకుటుంబాన్ని మొత్తంగా చంపించారు. ఇది విని రాజధానిలో అందరూ లోపల్లోపలే అట్టుడికిపోయారు కానీ ఏమీ చేయలేకపోయారు.

వారసత్వం

యాచమనాయుడు విద్యానగర సామ్రాజ్య సామంతులలో తంజావూరు నాయకులైన అచ్యుతప్పనాయకుడు, అతని కుమారుడు రఘునాధ నాయకుడు మాత్రమే సరైనవారని వారి సహకారం కోరారు. వారు అంగీకారంతో తీసుకువెళ్ళి రామదేవరాయలను ప్రవేశపెట్టారు. ఆ విషయం తెలిసిన జగ్గరాజు తంజావూరు సంప్రదాయ శత్రువులైన మధుర, జింజి నాయకుల సహకారంతో తంజావూరును పట్టుకునేందుకు బయలుదేరారు. తంజావూరు వారు కావేరి నదిని దాటకుండేందుకు కావేరీ అనకట్ట తెగగొట్టించారు. ప్రజలందరికీ ఉపకరించే చక్కని ఆనకట్ట కక్షలు తీర్చుకునేందుకు తెగగొట్టిన ఆ జగ్గరాక్షుసుని స్వయంగా చంపితీరతానని రఘునాధ నాయకుడు పంతం పట్టి మరీ యుద్ధంలో వధించారు. 1616లో జరిగిన ఈ యుద్ధానంతరం రామదేవరాయలు పట్టాభిషిక్తుడయ్యారు. ఆయన 1632 వరకూ చంద్రగిరిలో రాజ్యపాలన చేశారు.


రామదేవ  రాయలు   (1617-1632)

రామ దేవుడు లేదా వీర రామ దేవ రాయలు (క్రీ.శ 1617-1632) విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ప్రభువు. 1614లో తండ్రి మరియు ప్రభువైన రెండవ శ్రీరంగ రాయలు వరుసకు తన సోదరుడైన జగ్గారాయుడి చేత చంపబడిన తర్వాత 1617లో సింహాసనం అధిష్టించాడు. రెండవ శ్రీరంగ రాయల కుటుంబం మొత్తం చంపబడ్డా రెండవ వేంకటపతి దేవ రాయల నమ్మకస్తుడైన సేనాపతి యాచమ నాయుడు చెరసాల నుండి రామ దేవుడిని కాపాడాడు.


అంతర్యుద్ధం

వేంకటపతి దేవరాయలకు నలుగురైదుగురు భార్యలున్నా వారిలో ఎవరికీ పుత్రసంతానం కలగకపోవడంతో వెంకటాంబ అనే భార్య ఒక బ్రాహ్మణ స్త్రీ కుమారుణ్ణి తనకు, దేవరాయలకు పుట్టిన కుమారునిగా చూపజూశారు. విషయం తెలుసుకున్న వేంకటపతి దేవరాయలు ఆ పిల్లవాణ్ణి తన కుమారుని వలెనే పెరగనిచ్చి, బావమరిది కుమార్తెనిచ్చి పెళ్ళిచేసినా చివరకు రాజ్యాన్ని మాత్రం అన్నగారి కుమారుడైన శ్రీరంగరాయలకు ఇచ్చారు. వేంకటపతి దేవరాయల మరణానంతరం శ్రీరంగరాయలు రాజ్యానికి వచ్చిన కొద్దిరోజుల్లోనే వేంకటపతిదేవరాయల బావమరిదియైన జగ్గరాజు శ్రీరంగరాయలను సకుటుంబంగా ఖైదుచేశారు. శ్రీరంగరాయలు సకుటుంబంగా ఖైదులో ఉండగానే యాచమనాయుడు అనే సేనాని జగ్గరాయని కుట్రకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తూ రామదేవరాయలను ఖైదు నుంచి తప్పించారు. ఆపైన శ్రీరంగరాయల కుటుంబాన్ని కూడా తప్పించబోగా జగ్గరాజు మొత్తంగా కుటుంబాన్ని అంతా నరికివేశారు. జగ్గారాయుడు వేంకటపతి దేవ రాయల కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడిని సింహాసనంపై అధిష్టింపచేశారు. అసలు వారసుడైన రామ దేవుడి తరఫున యాచమ నాయుడు ఆ ప్రయత్నాల్ని అడ్డుకున్నాడు. అనంతరం జరిగిన అంతర్యుధ్ధంలో యాచమ నాయుడు జగ్గారాయుడిని ఓడించాడు.

తొప్పూరు యుద్ధం


అంతర్యుధ్ధంలో ఓడిపోయిన జగ్గారాయుడు మొదట అడవుల్లోకి పారిపోయినా తర్వాత మదురై, జింజి నాయకుల సహాయం కోరాడు. అప్పటికే విజయనగర సామ్రాజ్యం నుండి విడిపోయి సొంత పాలన చేయాలని వున్న మదురై మరియు జింజి నాయకులు, యాచమ నాయుడు మరియు రామ దేవుడి మీదకు దండెత్తారు. యాచమ నాయుడు మరియు రామ దేవుడు తంజావూరు నాయకుల సహాయం కోరగా, విజయనగర పాలనను గౌరవిస్తున్న తంజావూరు నాయకులు అందుకు సమ్మతించారు.

సైన్యం

జగ్గారాయుడు, మదురై, జింజి నాయకులు మరియు కొందరు పోర్చుగీసు వారు తిరుచ్చిరాపల్లి వద్ద పెద్ద సైన్యాన్ని మోహరించారు. యాచమ నాయుడు వెల్లూరు నుండి తన సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. అతనికి దారిలో తంజావూరు నాయకుడి సైన్యం కలిసింది. కర్ణాటక నుండి కొంత, డచ్చి మరియు జాఫ్నా సైన్యాలు కూడా కలిశాయి.
1616 చివరి మాసాల్లో రెండు సైన్యాలు తిరుచ్చికి సమీపంలో కావేరి నదికి ఉత్తరాన ఉన్న తొప్పూరు అనే ప్రదేశంలో ఎదురుపడ్డాయి. రెండు సైన్యాలు కలిపి పది లక్షల సైనికులు పోరాడిన ఈ యుధ్ధం దక్షిణ భారతదేశంలో జరిగిన అతిపెద్ద యుధ్ధాలలో ఒకటిగా చెప్పబడింది.

ఫలితం



రాజ సైన్యం ధాటికి జగ్గారాయని సైన్యం నిలువలేకపోయింది. సైన్యాధ్యక్షులైన యాచమనాయుడు, తంజావూరు రఘునాథ నాయకుడు సైన్యాన్ని ఎంతో క్రమశిక్షణతో నడిపించారు. జగ్గారాయని సోదరుడైన యెతిరాజు ప్రాణాల కోసం పారిపోయాడు. మదురై నాయకుడు పారిపోవాలని చూసినా తిరుచ్చి దగ్గర పట్టుబడ్డాడు. వేంకటపతి దేవ రాయల కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడు కూడా పట్టుబడ్డాడు. జింజీ నాయకుడు ఒక్క జింజీ కోట తప్ప మిగతా అన్ని కోటలను కోల్పోయాడు. 1617 మొదట్లో యాచమ మరియు తంజావూరు నాయకులు 15 ఏళ్ళ రామ దేవుడిని రామ దేవ రాయలుగా పట్టాభిషేకం చేశారు.

కొనసాగిన వైరం


జగ్గారాయని సోదరుడైన యెతిరాజు మరలా జింజీ నాయకుని సహాయంతో తంజావూరు మీదకు దండెత్తినా జయించలేక పట్టుబడ్డాడు. చివరకు గెలవలేక తన కుమార్తెను రామదేవునికిచ్చి వివాహం చేశాడు. వేంకటపతి దేవ రాయల కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడు 1619లో మరణించడంతో రామదేవునికి పరిస్థితులు చక్కబడ్డాయి.
అంతర్యుధ్ధాన్ని ఆసరాగా చేసుకొని బీజాపూరు సుల్తాను 1620లో కర్నూలు మీదకు సైన్యాన్ని పంపినా జయించలేక మరల 1624లో ఆ ప్రాంతాన్ని పూర్తిగా వశపర్చుకున్నాడు.


అంతర్యుధ్ధం తర్వాత సర్వసైన్యాధ్యక్షుడైన యాచమ నాయుడు యెతిరాజు కుమార్తెతో రామ రాయల వివాహాన్ని వ్యతిరేకించినా, రామరాయలు లెక్క చేయక వివాహం చేసుకున్నాడు. ఇది అవమానంగా భావించిన యాచమనాయుడు ముసలివాడైన తనని రాజాస్థానం నుండి విరమింపచేయాలని కోరాడు. ఇప్పుడు రామ రాయలికి మామ అయిన యెతిరాజు, అంతర్యుధ్ధం సమయంలో జగ్గారాయని నుంచి స్వాధీనం చేసుకున్న గొబ్బూరు ప్రాంతాన్ని తిరిగి ఇవ్వాలని యాచమ నాయుడిపై ఒత్తడి తెచ్చాడు. అందుకు సమ్మతించని యాచమనాయుడిపై తంజావూరు మరియు జింజీ సైన్యాల సహాయంతో రాజ సైన్యం యచమ నాయుడు పాలిస్తున్న ప్రాంతాలపై దండెత్తింది. యాచమ నాయుడి సైన్యం చిన్నదైనా ఎంతో గొప్పగా పోరాడి యెతిరాజు సైన్యాన్ని నిలువరించింది. ఎంతోకాలం సాగిన ముట్టడి తర్వాత గొబ్బూరు ప్రాంతాన్ని తిరిగి ఇవ్వడానికి యాచమ నాయుడు సమ్మతించాడు. పులికాటు, చెంగల్పట్టు మరియు మధురాంతకం ప్రాంతాలు పూర్తిగా వెల్లూరు ఏలుబడిలోకి వచ్చాయి. వెంకటగిరి ప్రాంతాన్ని పాలించడానికి యాచమనాయుడికి అవకాశం వున్నా తన చివరి రోజులను ఉదయారుపాళ్యం సేనాపతి రక్షణలో గడపడానికి నిశ్చయించుకున్నాడు.
వారసులు, సోదరులు లేని రామ రాయలు, ఆనెగొందిని పాలిస్తున్న వరుసకు సోదరుడు, ఆళియ రామ రాయల మనవడు అయిన పెద వేంకట రాయుడిని (మూడవ వేంకట రాయలు) వారసుడిగా ప్రకటించి 30 ఏళ్ళ వయసులో 1632లో 15 ఏళ్లు పరిపాలించి మరణించాడు.


మూడవ  వెంకటపతి రాయలు   (1632-1642)

రామరాయలు తరువాత వారి కుమారుడైన వేంకటపతిరాయలు అధిష్టించాడు, ఇతనికి పెద్ద వేంకటపతి అని గోపాలరాజని పేర్లు ఉన్నాయి. ఇతను ఆగష్టు 221639నఈస్టిండియా కంపెనీ ప్రతినిధి అయిన ఫ్రాన్సిస్ డేకి ఐదు మైళ్ళ పొడవు, ఒక మైలు వెడల్పు గల భూభాగమును రెండేండ్లు కౌలుగా ఇచ్చాడు.


మూడవ  శ్రీరంగ దేవ రాయలు    (1642-1675)

పెద్ద వేంకటపతిరాయలు పెంపుడు కొడుకు మూడవ  శ్రీరంగరాయలు  ఇతడు వీరుడు, దానశీలి అందగాడుగా పేరుగాంచాడు ఇతను గోలుకొండ సుల్తాను సహాయమున దామర్ల వేంకటనాయకుని పదవి నుండి తొలగించెను. పులికాటు, తిరుపతి ప్రాంతములను ఆక్రమించదలచిన కుతుబ్ షా సేనలను ఎదిరించి తరిమివేసెను. బ్రిటీషు కంపెనీవారికి మద్రాసు పాంతమును క్రొత్తగా కౌలుకిచ్చాడు, అనేకానేక అంతర్యుద్ధాలు, మోసాలు...., దక్షిణాది నాయకులు కుట్రలతో బీజాపూర్ సుల్తాన్ తో చేతులుకలిపి ఇతన్ని ఓడించారు. ఇతనితోనే అరవీటి వంశమేకాకుండా విజయనగర సామ్రాజ్యంకూడా పతనమైపోయింది. విజయనగర సామ్రాజ్యంలో ఎక్కువభాగాన్ని బీజాపూరు, గోల్కొండ సుల్తానులు ఆక్రమించారు. దిగువన దక్షిణాత్యంలో విజయనగర సామంతులైన మధుర, తంజావూరు, మైసూరు, నాయకరాజులు తమ తమ ప్రాంతాలను స్వంతం చేసుకుని తమ స్వంత రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇతను 36 సంవత్సరములు పరిపాలించి 1678న రాజ్యమును కోల్పోయి మైసూరు వెళ్ళి మరణించాడు.


పెనుకొండ - కొండ... పాట

రాయలసీమ సాహిత్యములో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుకొండ - కొండ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ వ్రాశాడు. ఈ పాటను జ్ఞప్తికి తెచ్చుకోవడం ఇక్కడ సమంజసము.




  చనిన నాళుల - తెనుగు కత్తుల

 సాన పెట్టిన బండ - ఈ

 పెనుకొండ - కొండ

 రంధ్రముల ప్రహరించు శత్రుల

 రక్తధారల ద్రావి త్రేచిన

  ఆంధ్ర కన్నడ రాజ్యలక్ష్ముల

 కఱితి నీలపు దండ - ఈ


 పెనుకొండ - కొండ

 వెఱవు లెఱుగని - బిరుదు నడకల

 విజయనగరపు రాజు కొడుకులు

 పొరలబోయగ కరుడు గట్టిన


 పచ్చి నెత్తురు కండ - ఈ

 పెనుకొండ - కొండ

 తిరుమలేంద్రుని - కీర్తి తేనెలు

  బెరసి దాచిన కాపుకవనపు

 నిరుపమ ద్రాక్షారసంబులు


  నిండి తొలకెడి కుండ - ఈ

  పెనుకొండ - కొండ

విజయ నగర రాజుల కాలంనాటి ఆర్ధిక పరిస్థితులు
విజయనగర రాజుల ఆర్థిక పరిస్థితి పటిష్ఠముగా ఉండేది.

దేశము సుభిక్షముగా ఉండేది, రాజాధాయమున అన్ని వ్యయాలూ పోను సంవత్సరాంతమునకు లక్ష మాడలు విగులు ఉండేవి.

సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి   

వజ్రములు 

కర్నూలు, గుత్తి, అనంతపురంలందు లభించు వజ్రములు చాలా పశస్తమైనవి. ఈ వజ్రములు ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి, తళ్ళికోట యుద్ధము లేదా రక్షస తంగిడి యుద్ధం తరువాత జరిగిన దోపిడిలో రాజుగారి ఖజాన యందు ఓ కోడిగుడ్డు అంత పరిమాణము ఉన్న వజ్రం దొరికినది అని చెప్పబడింది.

సైనికులకు కావలసిన కత్తులూ, శిరస్తానములు, మొదలగున్నవి తయారు చేయడం ఓ వృత్తిగా ఉండేది.

సుగంధ ద్రవ్యములు

కస్తూరి, పన్నీరు, బుక్క, గులాలు వంటి సుగంధ ద్రవ్యాలు ధనవంతులు ఉపయోగించేవారు.

పాడి పరిశ్రమ కూడా మంచి ఉపాధి కలిగించుతుండేది.

నాణెములు

బంగారు, వెండి నాణెములు తయారు చేయబడుచుండేవి, వరహా లేదా గద్యాణ అను బంగారు నాణెము ఉండేది తార్ అనునది ఓ వెండి నాణెము, జిటలు, కాసు అను రాగి నాణెములు వాడుకలో ఉండేవి।

విజయ నగర రాజుల కాలంనాటి పన్నులు

విజయనగర రాజ్యంలో పన్నులు చాలా ఎక్కువగా ఉండేవి, ఎక్కువ ఆదాయం, ఎక్కువ పన్నులుగా ఉండేవి. పన్నుల అధికారిగా భాండాగర్రి అని ఓ పదవి ఉండేది, ఇది చాలా అత్యున్నతమైనది, ప్రధాన మంత్రి తరువాత ఇదే విలువైనది.

రాజునకు ఆదాయ మార్గాలు చాలా ఉండేవి, ముఖ్యముగా భూమిశిస్తుపై ఆధారపడి ఉండేవారు.

భూమిశిస్తు

పంటపొలాలు కొలిపించేవారు, తరువాత న్యాయముగా 1/6 వ వంతు శిస్తు వసూలు చేసేవారు, కానీ చాలా పర్యాయములు ఇవి ఎక్కువగా ఉండేవి, చాలాసార్లు సగంకంటే ఎక్కువ పంట శిస్తుగా కట్టవలసి వస్తూ ఉండేది, కానీ భ్రాహ్మణుల కిచ్చిన అగ్రహారములందూ, ఇనాము భూములపైననూ న్యాయమైన 1/6 వ వంతు మాత్రమే వసూలు చేసేవారు, దేవాయల భూములపై 1/30 వ వంతు మాత్రమే వసూలు చేసేవారు. అడవులను కొత్తగా కొట్టి గ్రామములను ఏర్పరచి వ్యవసాయం చేసినవారికి పన్నులలో మినహాయింపు ఉండేది. మాగాణి, మెట్టభూములపై పన్నులు విడివిడిగా ఉండేవి. ఈ శిస్తు ధనముగా కానీ, ధాన్యముగా కానీ ఉండేది. మాగాణి భూములపై ధాన్యం రూపంలోనూ తోటలపైన అయితే ధనం రూపంలోనూ ఉండేది. రైతులు పన్నులు కట్టలేక వలసపోయిన దృష్టాంతములు ఉన్నాయి. గ్రామములయందు పన్నులు వసూలు చేయడానికి కరణము అను అధికారి ఉండేవాడు.

ఇతర పన్నులు

మత పన్ను
వృత్తి పన్ను
సామాజిక పన్ను
వాణిజ్య పన్ను
పుల్లరి
కొండగట్టు పన్ను
గ్రామదేవత పూజలపై పన్నులు
వేశ్యలపై పన్ను
మగ్గముపన్ను
ఆదాయపు పన్ను
ఉప్పు పన్ను
నిధి నిక్షేపాలపై పన్ను
పశువులపై పన్ను
నీటి బుగ్గలపై పన్ను
స్థిరాస్తులపై పన్నులు
ఎండుగడ్దిపై పన్ను
దేవాలయ యాత్రికులనుండి పన్ను
వివాయములపై పన్ను
ఊరేగింపులపై పన్ను
వృత్తి పన్ను    సవరించు
ఎంత చిన్న ఆదాయమైననూ, వృత్తిపన్ను చెల్లింపవలసి వచ్చేది, చాకలి, మంగలి, కుమ్మరి, పంచాణమువారు, పశువులకాపరులు, జంగమవృత్తి, చర్మకారులు, మేళగాండ్రు, మొదలగువారు వృత్తిపన్నులక్రిందకి వచ్చేవారు.

వేశ్యలపై పన్ను
వేశ్యలపై కూడా పన్ను ఉండేది. విజయనగరమందున్న వేశ్యలు చెల్లించేపన్ను 12,000 మంది సైనికాధికారులకు సరిపొయ్యేవి.












విజయ నగర రాజుల కాలంనాటి సైనిక స్థితి
విజయనగరము ప్రభలమైన సైనిక శక్తి.

విభాగములు    సవరించు

వీరి సైన్యమున

పదాతి దళము
గజ దళము
అశ్విక దళము
అను విభాగములు ఉన్నాయి. చివరలో పిరంగి దళము, తుపాకి దళములు కూడా ఉండెను

ఆయుధములు    సవరించు

సాధారణ సైనికునకు శిరస్త్రానము, డాలు, కత్తి ఉండేవి, ఇంకా ఈటె మొన్నగు ఆయుధములు కూడా ఉన్నాయి.

విశేషములు    సవరించు

ఈ సైన్యము ముఖ్యముగా రెండు రకములగా ఉండేవి

సిద్ద సైన్యము    సవరించు
అనగా ఇది కేంద్ర పరిపాలనలో ఉండే సైన్యము, ఇది సుమారుగా లక్ష మంది వరకూ ఉండేది (కృష్ణ దేవరాయల సమయమున) దీనికి జీత భత్యములు అన్నీ కేంద్ర ఖజానా నుండే వచ్చేది

అమర సైన్యము    సవరించు
లేదా నాయకర సైన్యము లేదా సామంత సైన్యము, దీనిని సామంతులు చూసుకునేవరు, అవసరమైనప్పుడు రాజునకు పంపించేవారు


తళ్ళికోట (రాక్షసి తంగడి) యుద్ధము


యుద్దము వివరాలు
కారణము: భారతదేశ ముస్లిం దండయాత్ర
తేదీ: జనవరి 26, 1565
స్థలము: ప్రస్తుత కర్ణాటకలోని రాక్షసి-తంగడి
పరిణామము: దక్కన్ సల్తనత్ల విజయము
ప్రత్యర్ధులు
విజయనగర సామ్రాజ్యము    దక్కన్ సల్తనత్‍లు
సేనాధిపతులు
రామ రాయలు    దక్కన్ సుల్తానులు & సేనానులు
సైనిక బలములు
140,000 పదాతి, 10,000 అశ్విక మరియు 100కు పైగా యుద్ధ గజములు    80,000 పదాతి, 30,000 అశ్విక మరియు కొన్ని డజన్ల ఫిరంగులు
ప్రాణనష్టము
నిర్దుష్ట సంఖ్య తెలియదు కానీ రామ రాయలుతో సహా తీవ్ర ప్రాణ నష్టము.    నిర్దుష్ట సంఖ్య తెలియదు కానీ ఒక మోస్తరు నుండి తీవ్ర ప్రాణ నష్టము.
తళ్ళికోట యుద్ధము లేదా రాక్షసి తంగడి యుద్ధం (1565 జనవరి 26[1] ) (జనవరి 23[2]) న విజయనగర సామ్రాజ్యానికి, దక్కన్ సుల్తానుల కూటమికి మధ్య జరిగింది. భారత చరిత్ర గతిని మార్చిన ప్రసిద్ధ యుద్ధాల్లో ఇది ఒకటి. ఈ యుద్ధం దక్షిణ భారతదేశాన చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యపు పతనానికి దారితీసింది. శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఉచ్ఛస్థితికి చేరుకున్న విజయనగర సామ్రాజ్యాన్ని ఆ తరువాతి కాలంలో అచ్యుత రాయలు, ఆ తరువాత సదాశివ రాయలు పరిపాలించారు. అయితే సదాశివరాయలు నామమాత్రపు రాజు. వాస్తవంలో పూర్తి అధికారాలు అళియ రామరాయలు వద్ద ఉండేవి. అతడే దైనందిన పరిపాలనను నిర్వహించేవాడు.

యుద్ధ నేపథ్యం

ఈ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఒక్కసారిగా ఉత్పన్నమైనవి కావు. దశాబ్దాలుగా విజయనగరానికి, సుల్తానులకు మధ్యగల వైరం తరచూ యుద్ధాలకు కారణభూతమవుతూనే ఉండేది. దాదాపు ప్రతి దశాబ్దంలోనూ ఒక పెద్ద యుద్ధం సంభవించింది. ముఖ్యంగా సంపదలతో తులతూగే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యన ఉన్న రాయచూరు అంతర్వేది ప్రాంతం వీరి వైరానికి కేంద్రంగా ఉండేది. 1509 నుండి 1565 వరకు విజయనగరంపై విజయం సుల్తానులకు అందని పండే అయింది. అంచేత, సహజంగానే విజయనగరాన్ని ఓడించాలనే కాంక్ష వారిలో బలపడింది.

శ్రీకృష్ణదేవరాయలు 1520 మే 19న బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్షాను చిత్తుగా ఓడించి రాయిచూరును స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత సుల్తాను విజయనగరాన్ని గెలుచుకోవాలనే కలను మర్చిపోయి, తన పొరుగున ఉన్న ముస్లిం రాజ్యాలతో స్నేహ సంబంధాల కొరకు ప్రయత్నించాడు. రాయచూరు ఓటమి దక్కను సుల్తానుల ఆలోచనలలో మార్పుతో పాటు సమైక్యంగా ఉండాలనే తలంపును తీసుకువచ్చింది.[3]

ఈ సుల్తానులు ఒకరంటే ఒకరికి పడేది కాదు. అహ్మద్‌నగర్, బీజాపూర్ సుల్తానుల మధ్య పచ్చగడ్డి చేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది. తమ తగాదాల పరిష్కారం కోసం వారు రామరాయల సహాయం అడగడం, రామరాయలు ఎవరో ఒకరి పక్షం వహించడం జరుగుతూ వచ్చింది. మొదట్లో నిజాంషాతో కలిసి ఆలీ ఆదిల్‌షాను ఓడించాడు. కొంతకాలానికే ఆదిల్‌షా రామరాయలుతో మైత్రి నెరపి నిజాంషాపై యుద్ధం చేసాడు. మరో సమయంలో హుసేన్‌ నిజాంషా, ఇబ్రహీం కుతుబ్‌షా కలిసి అలీ ఆదిల్‌షా పైకి దండెత్తినపుడు, అతడు రామరాయల సాయం కోరాడు. ఆదిల్‌షా, రామరాయల సంయుక్త సైన్యాన్ని కళ్యాణి వద్ద ఎదుర్కోడానికి సిద్ధపడ్డాక, సరిగ్గా యుద్ధం మొదలు పెట్టబోయే ముందు, కుతుబ్‌షా నిజాంషాను ఏకాకిని చేసి, తాను రామరాయలుతో చేరిపోయాడు. చేసేది లేక హుసేన్‌షా అహ్మద్‌నగర్‌కు పారిపోయాడు. ఒక పరస్పర నమ్మకంతో కూడిన, కాలపరీక్షకు నిలిచిన స్నేహాలు ఎవరి మధ్యనా లేవు.

సైనికపరంగా సుల్తానులపై తనది పైచేయిగా ఉండడంతో రామరాయలు వారితో చులకనగా వ్యవహరించేవాడు. తన సభలో వారి రాయబారులకు తగు గౌరవం ఇచ్చేవాడు కాదని చరిత్రకారులు చెబుతారు. ఐతే, ఈ విషయం మీద చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు చరిత్రకారుల ప్రకారం రామరాయలు ముస్లిములు నివసించే ప్రాంతాలను ఆక్రమించుకున్నపుడు ముస్లిము మతాచారాలను అవమానించేవాడని చెబుతారు. కాని కొందరు ఇది సరికాదనీ, రామరాయల వద్ద అనేక మంది ముస్లిములు పనిచేసేవారనీ, రామరాయలు వారి కొరకు ప్రత్యేకంగా నివాసస్థలాలు, ప్రార్థనా స్థలాలు కట్టించి ఇచ్చేవాడనీ అంటారు.

విజయనగర సామ్రాజ్యం చాలా విశాలంగా ఉండేది. అంతేకాకుండా సిరి సంపదలతో తులతూగుతూ అపారమైన సైనిక సంపత్తి కలిగి ఉండేది. ఇంతటి బృహత్తరమైన సామ్రాజ్యాన్ని జయించగలిగే శక్తి ఏ ఒక్క ముస్లిము రాజ్యానికీ అప్పట్లో లేదు. దక్కన్ సుల్తానులందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడితేనే విజయనగరాన్ని జయించే అవకాశం ఉంది. విజయనగరాన్ని జయించడానికి కూటమి ఏర్పాటుకు పూనుకోవాలని ఆదిల్‌షా సన్నిహితులు, సలహాదారులు ఆదిల్‌షాకు చెప్పారు. ఇంకో గమనించవలసిన విషయం ఏమిటంటే ఆ సమయంలో ఆలీ ఆదిల్‌షాకు, రామరాయలకు మధ్య మైత్రి ఉండేది. అయినప్పటికీ అతడు గోల్కొండ సుల్తాను ఇబ్రహీం కుతుబ్‌షాతో మంతనాలు చేశాడు. ఇబ్రహీం దానికి ఒప్పుకోవడమే కాక, ఆదిల్‌షా బద్ధ విరోధియైన అహ్మద్‌నగర్ సుల్తానుకు రాయబారం పంపి, ఆలీ ఆదిల్‌షా, హుస్సేన్‌షా లకు సంధి కుదిర్చాడు. ఈ సంధిలో భాగంగా హుసేన్‌షా కూతురు, చాంద్ బీబీ సుల్తానును ఆలీ ఆదిల్‌షా పెళ్ళి చేసుకోగా, ఆలీ ఆదిల్‌షా చెల్లెలు, బీబీ హదియా సుల్తానును హుసేన్‌షా కొడుకు, మూర్తజా పెళ్ళి చేసుకున్నాడు.

విజయనగరాన్ని పతనం చేయడానికి రామరాయలతో తన చెలిమిని తుంచుకొనే ఎత్తుగడను ఆలీ ఆదిల్‌షా వేశాడు. ఈ ఎత్తుగడలో భాగంగా తన వద్ద నుండి తీసుకున్న కొన్ని ప్రాంతాలను తిరిగి ఇచ్చివేయవలసిందిగా కోరుతూ రామరాయలు వద్దకు ఒక రాయబారిని పంపాడు. ఆదిల్‌షా ఊహించినట్లు గానే రామరాయలు ఆ రాయబారాన్ని తిరస్కరించాడు. రాయబారం తిరస్కరించడంతో యుద్ధం మొదలు పెట్టేందుకు ఒక కారణం కూడా సమకూరింది.

యుద్ధ భూమి


తళ్లికోట యుద్ధం ఈ పటములో చూపించిన వివిధ ప్రదేశాలలో జరిగినది భిన్నాభిప్రాయాలు ఉన్నవి[2] (వికీమాపియాలో ఈ ప్రాంతం)
ఈ యుద్ధం జరిగిన ప్రదేశంపై అనేక వాదనలు ఉన్నాయి. ఈ యుద్ధం రాక్షసి, తంగడి అనే రెండు గ్రామాల మధ్య జరిగిందని కొందరు, కాదు తళ్ళికోట వద్ద జరిగిందని మరి కొందరు వాదిస్తారు. అయితే ఈ రెండు ప్రదేశాలు కాదని మరో రెండు వాదనలు ఉన్నాయి. రామరాజ్ఞ బఖైర్ మరియు కైఫియత్‍ల వంటి సాంప్రదాయక హిందూ రచనలు, మూలాలూ, యుద్ధము రాక్షసి తంగడి[6] వద్ద జరిగిందని, ఫరిస్తా మొదలగు ముస్లిం చారిత్రికులు తళ్లికోట వద్ద జరిగిందని అభిప్రాయపడ్డారు.

దుర్గా ప్రసాదు అభిప్రాయం
విజయనగర సైన్యం రాక్షసి, తంగడి అనే రెండు గ్రామాల మధ్య మైదానంలో విడిది చేసింది. సుల్తానుల సమైక్య సైన్యం తళ్ళికోట అనే గ్రామం వద్ద విడిది చేసింది. యుద్ధం మాత్రం కృష్ణానదికి దక్షిణాన మస్కి మరియు హుక్కేరి నదుల సంగమ ప్రదేశములోని బన్నిహట్టి అనే ప్రదేశంలో జరిగింది.[7]
రాబర్ట్ సెవెల్ అభిప్రాయం
తళ్ళికోట కృష్ణకు 25 మైళ్ళు ఉత్తరాన ఉంది. కానీ యుద్ధం, కృష్ణకు దక్షిణాన రామరాయలు విడిది చేసిన ముద్గల్ నుండి పది మైళ్ల దూరంలో జరిగింది. సుల్తానుల కూటమి కృష్ణానది వంపులో ఇంగల్గి గ్రామము వద్ద దాటి ఉండవచ్చు. కాబట్టి యుద్ధం ఇంగలిగి గ్రామం నుండి ముద్గల్ పోయే దారిలో భోగాపూర్ (బాయాపూర్) అనే గ్రామం వద్ద జరిగి ఉండవచ్చు.
యుద్ధ వివరణ    సవరించు

నలుగురు సుల్తానులు తమ సైన్యాలను బీజాపూరు సమీపంలోని ఒక మైదాన ప్రాంతంలో కలిపారు. 1564 డిసెంబర్ 25న ఈ కూటమి సైన్యాలు దక్షిణ ముఖంగా ప్రయాణించి కృష్ణకు 25 మైళ్ళ దూరంలోని తళ్ళికోట గ్రామం వద్దకు చేరుకున్నాయి. కూటమి సైన్యాలు చాలా రోజుల పాటు అక్కడే విడిది చేశాయి.

అక్కడ విజయనగరములో రామరాయలు కూడా యుద్ధ సన్నాహాలు ప్రారంభించాడు. తన తమ్ముళ్ళు తిరుమల రాయలు, వెంకటాద్రి రాయలుల సమేతంగా కృష్ణకు దక్షిణ భాగాన రాక్షసి, తంగడి గ్రామాల మధ్యన సైన్యాన్ని మోహరించాడు. సుల్తాను సైన్యం నదిని దాటే అవకాశం గల అన్ని చోట్ల కాపలాను, పహారాను ఏర్పాటు చేశాడు.

అయితే సుల్తానుల సైన్యం నది దిగువగా ప్రయాణం చేస్తున్నట్లుగా రామరాయల సైన్యాన్ని నమ్మించి, ఒకరాత్రి వేళ నదిని దాటడం ప్రారంభించింది. తెల్లవారేసరికి సైన్యమంతా దక్షిణ తీరానికి చేరుకుంది. ఆ మరుసటి రోజున - 1565 జనవరి 23 (యుద్ధం జరిగిన తేదీని ఫరిష్తా జనవరి 23గా గుర్తించాడు. రాబర్ట్ సెవెల్ కూడా తన పుస్తకంలో అదే తేదీని తీసుకున్నాడు.) - రెండు పక్షాల సైన్యాలు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. రెండు వైపులా సైన్యం లక్షల్లో ఉంది. రామరాయలు సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు. ఎడమ వైపున తిరుమల రాయలు ఆలీ ఆదిల్‌షాను, మధ్యన రామరాయలు హుసేన్ నిజాంషాను, కుడివైపున వెంకటాద్రి రాయలు ఇబ్రహీం కుతుబ్‌షా, ఆలీ బరీద్‌లను ఎదుర్కొనే విధంగా యుద్ధ వ్యూహ రచన చేశాడు. దక్కన్ సుల్తానుల కూటమి సైన్యం ఫిరంగులను మోహరించింది. ఈ ఫిరంగులను కప్పిపుచ్చుతూ రెండువేలమంది సైనికులు విజయనగర సైన్యంపై బాణాల వర్షం కురిపించారు. విజయనగర సైన్యం వీరిపైకి దాడి చేసే సమయానికి వీరు లాఘవంగా తప్పుకుని ఫిరంగులకు దారినిచ్చారు. విజయనగర సైన్యం సరిగ్గా ఫిరంగులకు ఎదురుగా వచ్చింది. హఠాత్తుగా మొదలైన ఫిరంగి దాడులతో విజయనగర సైన్యం వెనకడుగు వేసింది.

పల్లకీ ఎక్కి పర్యవేక్షిస్తున్న రామరాయలు పల్లకీ దిగి ఒక ఎత్తైన సింహాసనమెక్కి బంగారు నాణేలు విరజిమ్ముతూ సైన్యాన్ని ఉత్సాహపరచాడు. విజయనగర సైన్యం కూడా కూటమి సైన్యంపై దాడులు చేసి బాగా నష్టం కలిగించడంతో కూటమి సైన్యం వెనక్కు కొంచెం తగ్గింది. మధ్యభాగంలోని కూటమి సైన్యం ఫిరంగులలో రాగి నాణేలను కూరి విజయనగర సైన్యంపై పేల్చింది. ఈ రాగి నాణాల దాడికి వేలాది సైనికులు బలయ్యారు. సైన్యం అంతా చెల్లాచెదురయింది. ఈ హడావుడిలో రామరాయలు గద్దె దిగి, మళ్ళీ పల్లకి ఎక్కబోయాడు. సరిగ్గా అదే సమయానికి ఫిరంగుల మోతలకు బెదిరిన కూటమి సైన్యంలోని ఓ ఏనుగు పరిగెత్తుకుంటూ రామరాయల పల్లకీ వైపు వచ్చింది. అదిచూసి భయపడిన బోయీలు పల్లకీని వదిలేసి పరుగెత్తారు. కిందపడిపోయిన రామరాయలు తేరుకుని లేచి గుర్రమెక్కేలోగా హుసేన్ నిజాం షా సైన్యం రామరాయలను పట్టుకుని బంధించి, సుల్తాను ముందు హాజరు పరచింది. హుసేన్‌షా స్వయంగా రామరాయల తల నరికి యుద్ధభూమిలో పైకెత్తి ప్రదర్శించాడు.

తమ రాజు మరణం చూసిన విజయనగర సైన్యం దిక్కుతోచని స్థితిలో పరుగులు తీసింది. కూటమి సైన్యం వారిని వెంటాడి హతమార్చింది. కనీసమాత్రపు ఆత్మరక్షణను కూడా ఆలోచించే పరిస్థితిలో లేని సైన్యం చెల్లాచెదురైంది. వెంకటాద్రి రాయలు మరణించాడు. తిరుమలరాయలు ఒక కన్ను కోల్పోయి వెనక్కి, నగరానికి పారిపోయాడు. రామరాయల కుమారుడు తన బంధువులతో సహా ఆనెగొంది నుండి మూడు కోసుల దూరములో ఉన్న ఒక లోతైన గుహలో తలదాచుకున్నాడు.

విజయనగర సైన్యం ఓటమికి కారణాలు    సవరించు

హిందూ సైన్యములో వేగంగా కదిలే అశ్వాలు తక్కువ. మెల్లగా కదిలే ఏనుగులపై ముఖ్య సేనాధిపతులుండగా సుల్తానుల సైన్యములో పారశీక అశ్వములపై సుశిక్షుతులైన యోధులున్నారు. ఇది సహజంగా సుల్తానులకు లాభించింది.
సుల్తానుల సేనాధిపతులు యువకులు కాగా విజయనగర సైన్యాధిపతులు ముగ్గురూ వయసు మీరిన వారు -రామరాయలతో సహా.
హిందూ సైనికుల వద్ద వెదురు బద్దలతో చేసిన ధనుస్సులుండగా ముస్లింలవద్ద లోహముతో చేసిన ధనస్సులున్నాయి. వీటివల్ల బాణములు వేగంగా, గురి తప్పకుండా ఛేదిస్తాయి.
విజయనగర సైనికుల వద్ద ఏడు అడుగుల బల్లేలు, ఈటెలూ ఉన్నాయి. సుల్తానుల అశ్వ సైనికుల వద్ద పదిహేను అడుగుల పొడవున్న బల్లేలున్నాయి.
సుల్తానుల సైన్యములో తుర్కిస్తాన్ నుండి వచ్చిన సుశిక్షితులైన తుపాకిధారులుండగా విజయనగర సైన్యములో సరైన శిక్షణలేని యూరోపియను కూలి సిపాయిలు ఉన్నారు.
అన్నింటికన్నా ముఖ్య కారణం, వేలాది హిందూ సైనికులకు నాయకత్వము వహించుతున్న జిలాని సోదరుల వెన్నుపోటు. గతంలో అదిల్ షా వద్దనుండి పారిపోయి వచ్చి రామరాయల ఆశ్రయము పొందిన ఈ సోదరులు కీలక సమయములో యుద్ధరంగాన్ని వదలి పోవటం [9].
పర్యవసానాలు

ఈ యుద్ధంతో భారత్‍లో హిందూ సామ్రాజ్యాలకు ప్రమాదఘంటికలు మోగించింది. దక్షిణభారతంలో చిట్టచివరి హిందూ మహా సామ్రాజ్యానికి తెరపడింది. అయితే గెలిచిన సుల్తానుల మధ్య కూడా శాశ్వత శాంతి నెలకొనలేదు. తమలోతాము కలహించుకోవడంతో వారు బలహీనపడి చివరికి మొగలులకు, ఆ తరువాత బ్రిటిషు వారికీ లొంగిపోయారు.


 

కింది జాబితా రాబర్ట్ సెవెల్ రాసిన ఎ ఫర్గాటెన్ ఎంపైర్ (విస్మృత సామ్రాజ్యం) అనే పుస్తకం నుండి సంగ్రహించినవి.

 

సంగమ వంశము
హరిహర I (దేవ రాయ) 1336-1343

బుక్క I 1343-1379

హరిహర II 1379-1399

రెండవ బుక్క రాయలు 1399-1406

మొదటి దేవ రాయలు 1406-1412

వీర విజయ 1412-1419

రెండవ దేవ రాయలు 1419-1444

(తెలియదు) 1444-1449

మల్లికార్జున రాయలు 1452-1465 (తేదీలు సందేహాస్పదం)

రాజశేఖర రాయలు 1468-1469 (తేదీలు సందేహాస్పదం)

మొదటి విరూపాక్ష రాయలు 1470-1471 (తేదీలు సందేహాస్పదం)

ప్రౌఢదేవ రాయలు 1476-? (తేదీలు సందేహాస్పదం)

రాజశేఖర 1479-1480 (తేదీలు సందేహాస్పదం)

రెండవ విరూపాక్ష రాయలు 1483-1484 (తేదీలు సందేహాస్పదం)

రాజశేఖర 1486-1487 (తేదీలు సందేహాస్పదం)


సాళువ వంశము

నరసింహ 1490-?

తుళువ వంశము


నరస (వీర నరసింహ) ?-1509

శ్రీ కృష్ణదేవరాయలు 1509-1530

అచ్యుత దేవరాయలు 1530-1542

సదాశివరాయలు (నామమాత్రపు రాజు) 1542-1567

అరవీటి వంశము

రామరాయలు (పట్టాభిషిక్తుడు కాదు) 1542-1565

తిరుమల రాయలు (పట్టాభిషిక్తుడు కాదు) 1565-1567

తిరుమల (పట్టాభిషిక్తుడు) 1567-1575

రెండవ శ్రీరంగరాయలు 1575-1586

మొదటి వెంకటాపతి రాయలు 1586-1614

ఆరవీడు (తేదీలు సందేహాస్పదం, కేవలం శాసనాల ఆధారంగా సేకరించిన సమాచారం) రాజుల్లో కిందివారు ఉన్నారు. ప్రతిపేరుతోను ఒకరికంటే ఎక్కువమంది రాజులు ఉన్నారు. కాలం - 1614 నుండి చివరగా తెలిసిన 1739 వరకు


శ్రీరంగ దేవరాయ II 1614-1615

రామ దేవరాయ 1615-1633

వెంకట దేవరాయ III 1633-1646

శ్రీరంగ దేవరాయ III 1614-1615 ko



Wikisource


తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

విజయనగర సామ్రాజ్యం- పీస్ మరియు నూనిజ్ యాత్రాకథనాలు
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

విజయనగర సామ్రాజ్యము

విజయ నగర వంశస్తుల వంశ వృక్షములు

విజయ నగర రాజుల కాలంనాటి పన్నులు

విజయ నగర రాజుల కాలంనాటి ఆర్ధిక పరిస్తితులు

విజయ నగర రాజుల కాలంనాటి సైనిక స్థితి

విజయ నగర రాజులు పరిపాలనా కాలాన్ని అనుసరించి


సార్వజనికమైన వనరు

ఎ ఫర్గాటెన్ ఎంపైర్: విజయనగరం: e కాంట్రిబ్యూషన్ టు ది హిస్టరీ ఆఫ్ ఇండియా

హరిహర, బుక్క రాయల కథ

హంపి-చరిత్ర పర్యాటకం

విజయనగర నాణెములు

 Robert Sewell, A Forgotten Empire (Vijayanagar): A contribution to the history of India, Chapter 2; http://www.gutenberg.org/dirs/etext02/fevch10.txt








Other Sources

 పెనుగొండ లక్ష్మి  - పుట్టపర్తి నారాయణాచార్యులు,

మరపురాని మధుర గాధ  - పుట్టపర్తి నారాయణాచార్యులు,

అళియ రామరాయలు  నవల  - చిలుకూరి వీరభద్రరావు ,

బలిజ కుల చరిత్ర  - నారాయణ దేశాయి

చిలుకూరి నారాయణ రావు లాంటి ఎందరో చరిత్రకారుల రచనలే ఆధారాలు

 http://www.andhrajyothy.com/artical?SID=29639&SupID=29

http://charitrarealfacts.blogspot.in/2014/07/blog-post_28.html?m=1

sreekrishnadevaraya.blogspot.in/

http://balijavani.blogspot.in/?m=1
 
↑ ఈ తేదీ ఇంగ్లీషు వికీపీడియా నుండి స్వీకరించబడింది.

↑ యుద్ధం జరిగిన తేదీ జనవరి 23గా రాబర్ట్ సీవెల్ తన విస్మృత సామ్రాజ్యం పుస్తకంలో రాసాడు. ఆ పుస్తకంలో రిఫరెన్సు 327 వద్ద అలా ఎందుకు తీసుకున్నాడో కూడా రాసాడు.
↑ విస్మృత సామ్రాజ్యం - రాబర్ట్ సెవెల్ రచన
↑ Vijayanagara: History and Legacy S. Krishnaswami Aiyangar (ed.) Aryan Books International (2000) పేజీ.248
↑ యుద్ధ సమయములో అలీ ఆదిల్‌షా వద్ద మంత్రిగా పనిచేసిన రఫీయుద్దీన్ షిరాజీ చెప్పిన వృత్తాంతము. మీర్జా ఇబ్రహీం జుబిరీ రాసిన బసతిన్-ఉస్-సలాతీన్ నుండి అనువదించబడినది
↑ Patvardhan (The battle of Raksas Tangadi), Chanderkar (The destruction of Vijayanagara), Father Heras (Aravidu dynasty of Vijayanagara)[1]
↑ 1565 వరకు ఆంధ్రుల చరిత్ర- జె.దుర్గా ప్రసాదు పేజీ.257
↑ Krishnaswami Aiyangar et.al,(2000) పేజి.254
↑ History of South India, Prof. K.A.N. Sastri, pp 267 and Dr. S.U. Kamath, A Concise History of Karnataka, pp 172-73

బయటి లింకులు 




విజయ నగర రాజులు

సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి